April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

ప్రమాదవశాత్తూ బావిలో పడిన వృద్దురాలు.. దేవుడిలా స్పందించిన దివ్యాంగుడు..




ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన వృద్దురాలిని ఓ దివ్యాంగుడు కాపాడాడు. ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా బావిలోకి దిగి విలవిలలాడుతున్న ఓ ప్రాణాన్ని కాపాడాడు. దీంతో చివరి నిమిషంలో వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. తుది శ్వాస వదిలేస్తుందనుకున్న క్రమంలోనే దివ్యాంగుడు అప్రమత్తమవ్వడంతో ఓ ప్రాణం దక్కినట్లయింది. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన గడ్డం మల్లమ్మ(80) శనివారం వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడింది. సమీపంలోనే ఓ ఇంట్లో ఉంటున్న బండారి రవిందర్ అనే దివ్యాంగుని భార్య వృద్దురాలిని గమనించింది. అప్పుడే అక్కడ కూర్చొని ఉన్న వృద్దురాలు కనిపించడం లేదని బావిలో జారిపడిపోయి ఉంటుందని తన భర్తకు సమాచారం ఇచ్చింది.

దీంతో వెంటనే బావి వద్దకు చేరుకున్న రవిందర్.. వృద్దురాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని గమనించాడు. బావిలోకి దిగిన రవిందర్ వృద్దురాలిని కాపాడాడు.. తన కాళ్లపై ఆమె తల పెట్టి కరెంటు మోటర్ బెల్టు సాయంతో నీటిలోని ఉండిపోయాడు. 20 నిమిషాల పాటు ఆమెను అలాగే పట్టుకుని ఉన్నాడు.


ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని వృద్దురాలిని తాళ్ల సాయంతో బయటకు తీశారు. చికిత్స కోసం వెంటనే ఆమెను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. మల్లమ్మను కాపాడేందుకు సాహసించిన రవిందర్ ను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. అయితే వృద్ధురాలి మానసిక పరిస్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.. ప్రస్తుతం..వృద్దురాలు కోలుకుంటుందని వెల్లడించారు.

Also read

Related posts

Share via