February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: క్రైమ్‌కు నాయకురాలు నాయనమ్మ.. కోడిబుర్ర స్కెచ్…



ముసలావిడే కానీ మహా ముదురు. అంతా కోడిబుర్ర తెలివితేటలు. పక్కా ప్లాన్‌తో సొంత మనవరాలి భర్తను తన స్కెచ్‌లోకి దించి మరీ బలి తీసుకుంది. చేతికి మట్టి అంటకుండా పనికానిచ్చేసింది. కరుడు గట్టిన డాన్లకు కూడా ఇన్ని చావు తెలివితేటలు ఉండవేమో. పరువుకోసం పంచాయతీ పెట్టి మరీ మృతుడు తండ్రికి వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చినట్లే తన మనవళ్లను ఉసిగొల్పింది. సొంత మనవరాలి కాపురంలో నెత్తుటి వరదను పారించింది. సొంత చెల్లిలి నుదుటిపై ఓఅన్న రక్తతిలకం దిద్దాడు. ఇంతకూ సూర్యాపేట మర్డర్ స్కెచ్‌పై రిమాండ్‌రిపోర్ట్‌లో ఉన్న విషయాలేంటి..?


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు టీవీ9 చేతిలో ఉంది. పోలీసుల దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పరువు హత్యకు సంబంధించి టీవీ9 రిమాండ్ రిపోర్టును సంపాదించింది.


రిమాండ్ రిపోర్ట్ ఓపెన్‌ చేస్తే దిమ్మతిరిగే విషయాలే. కాటికి కాలుచాపే వయసులో…తన మనవడితో కలిసి ముసలావిడ బుచ్చమ్మ వేసిన మర్డర్‌ స్కెచ్‌ చూస్తే…మాఫియా డాన్‌లు సైతం కంగుతినాల్సిందే. అంత పకడ్బదీగా స్కెచ్ వేసి….కసాయివాడి చేతిలోకి గొర్రెపిల్లను తెచ్చినట్లుగా…తన మనవడి స్కెచ్‌లోకి తన మనవరాలి భర్త బంటిని పకడ్బందీగా తీసుకొచ్చింది. పథకం ప్రకారం మర్డర్ ప్లాన్‌ను అమలు చేసింది…

కృష్ణ అలియాస్ బంటిని హత్య చేసేందుకు భార్గవి నాయనమ్మ డాన్ అవతారమెత్తింది. తన మనవడితో కలిసి భారీ స్కెచ్‌కు రంగం సిద్దం చేసింది. తన మనవరాలిని పెళ్లి చేసుకున్న నాటి నుంచే బంటి హత్యకు భార్గవి కుటుంబం స్కెచ్ వేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌తో తేలింది. అంతేకాదు బంటి తండ్రిని కూడా పోలీసుల ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. బంటి భార్గవి వివాహం తర్వాత పెద్దమనుషుల ముందు పంచాయతీ నడిచింది. ఈపంచాయితీలో పోలీసులు కూడా పాల్గొన్నారని బంటి కుటుంబసభ్యులు చెబుతున్నారు. భార్గవిని బుచ్చమ్మ ఇంటికి తీసుకెళ్లేందుకు నానారకాలుగా భయపెట్టినట్లు తెలిసింది. అయినా అందరి ముందు బంటితోనే కలిసి ఉంటానని చెప్పడంతో పోలీసుల ముందే ఓ బాండ్ పేపర్ కూడా రాసుకున్నారట. ఇకమీదట తన తండ్రి కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాండ్‌ పేపర్ మీద రాయించి సంతకం కూడా తీసుకున్నారట. ఈసందర్భంలోనే బంటి నాన్నతో బుచ్చమ్మ సవాల్ చేసింది. నీ కొడుకు బంటిని బతకనీయనంటూ ఆసందర్భంలోనే హెచ్చరించింది. అప్పట్నుంచి బుచ్చమ్మ పగతో రగిలిపోతూనే ఉందట. పలుమార్లు మనవళ్లతో కలిసి బుచ్చమ్మ బంటి హత్యకు ప్రణాళికలు రచించారు. మర్డర్ చేసేందుకు ఓ నాటు కత్తిని కూడా కొనుగోలు చేశారు. రెండు వారాల వ్యవధిలో మూడు స్కెచ్‌లు వేశారు. కానీ రెండు ప్లాన్‌లు ఫెయిల్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ పేరుతో రెండు దఫాలు బంటిని తమ వద్దకు పిలుపించుకున్నారు. కానీ స్కెచ్ పారలేదు. ఎలారా చంపేది అని ముసలావిడ బుచ్చమ్మ తనలో తనే మదనపడేదట. ఎలాగైనా బంటిని వేసేయాలని ఫిక్స్ చేసుకుంది. ఈసారి కోడిబుర్రతో ఆలోచించి దావత్‌ ప్లాన్ చేసింది.


బుచ్చమ్మ అతని మనవడు నవీన్‌తో పాటు అతని స్నేహితుడైన బైరు మహేశ్ తో కలిసి ప్లాన్ సిద్ధం చేశారు. పథకం ప్రకారం.. రియల్ ఎస్టేట్‌ వ్యాపారి మహేశ్‌తో బంటికి కాల్ చేసి నాటుకోడి దావత్‌కు పిలిపించాడు. తన వ్యవసాయబావి దగ్గరే ఇద్దరు సిట్టింగ్‌ వేశారు. వీరిద్దరకి కొద్దిదూరంలో భార్గవి సోదరులు నవీన్, వంశీ మాటు వేసి ఉన్నారు. ఈవిషయం తెలియని బంటి…మహేష్‌ కలిసి నాటుకోడి, ఓకూల్‌డ్రింక్ తీసుకున్నాడు. మహేష్ కళ్లు తాగాడు. పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో నవీన్‌, వంశీలకు మహేష్‌ సమాచారం అందించాడు. బైక్‌పై ముందు కూర్చున్న బంటిని వెనుక కూర్చున్న మహేష్‌ మెడపట్టుకుని కిందపడేశాడు. వెంటనే నవీన్ వంశీ వచ్చి బంటిని గొంతు నులిమి చంపేశారు. తర్వాత కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి నవీన్‌ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. శెభాష్ మనవళ్లారా..అంటూ నవీన్, వంశీల భుజం తట్టి…కేసు విషయంలో ఎవరికీ ఏమి కాకుండా చూసుకుంటానంటూ నిందితులకు హామీ కూడా ఇచ్చింది. శవాన్ని ఎక్కడో పడేసేవాళ్లే కానీ… తాము చంపామని ఊళ్లో తెలియాలి.. అందరు తమను చూసి భయపడాలి.. ఆ భయాన్నే అదనుగా చేసుకొని రాజకీయంగా ఎదగొచ్చని స్కెచ్చేశాడు నవీన్‌. అందుకే పిల్లలమర్రి దగ్గరే బంటి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు.

బంటి హత్యకేసులో సంబంధమున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1గా నవీన్, ఏ2 భైరీ మహేష్, ఏ3 వంశీ, ఏ4 భార్గవి తండ్రి సైదులు, ఏ5 బుచ్చమ్మ, ఏ6 సాయిచరణ్‌గా నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేసును వాపస్ తీసుకోవాలని తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు బంటి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కేసు వాపస్ తీసుకుంటే 2కోట్లు ఇస్తామని..లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు భార్గవి వాపోతున్నారు

Also read

Related posts

Share via