SGSTV NEWS
CrimeTelangana

ఏసీబీ అనగానే.. అలా ఎలా మోసపోయారు సార్.. రూ.10 లక్షలు సమర్పయామి.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..


మహా మాయగాళ్లు ఈ మోసగాళ్లు.. ఏసీబీ అధికారి పేరుతో ఓ ఆర్టిఏ అధికారికి ఫోన్ చేసి బెదిరించిన కేటుగాడు ఏకంగా 10 లక్షలు కాజేశాడు. ఆ డబ్బంతా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని దర్జాగా దోచేశాడు.. ఏసీబీ అధికారి పేరు చెప్పగానే గజగజా వణికిపోయి పది లక్షల రూపాయలు సమర్పించుకున్న ఆ ఆర్టీఏ అధికారి నిండా మునిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘరానా దోపిడీ ఘటన వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జరిగింది.. జైపాల్ రెడ్డి అనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరంగల్ లో ఇంచార్జ్ ఎం.వీ.ఐ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం ఈ అధికారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీపై ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చిందని బెదిరించాడు.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని.. ఆర్టీఏ కార్యాలయంలో అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నావంటూ బెదిరించాడు.. సెటిల్ చేసుకుంటే DSP గారు వదిలేస్తారు.. లేదంటే తెల్లవారే లోపు నీపై దాడులు ఉంటాయని వణుకు పుట్టేలా చేశాడు. మచ్చుకు కొన్ని విషయాలను చెప్పి ఆ రవాణాశాఖ అధికారి వణికి పోయేలా చేశాడు.. దీంతో హడలెత్తిపోయిన ఎం.వీ.ఐ జైపాల్ రెడ్డి మొత్తం మూడు దఫాలుగా డబ్బు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు.. మొదట రెండు లక్షల రూపాయలు సమర్పించుకున్న ఎంవీఐ మరుసటి రోజు మరో 8,20,000 రూపాయలు బదిలీ చేశాడు..

అయితే.. 9886826656, 9880472272 నెంబర్ల నుండి MVI కి ఫోన్ కాల్స్ వచ్చాయి.. డబ్బు లూటీ అయిన తర్వాత మేల్కొన్న సదరు రవాణా శాఖ అధికారి సహచర సిబ్బందికి విషయం తెలియపరిచాడు. ఆ నెంబర్లు పరిశీలించిన తర్వాత ఇది సైబర్ క్రైమ్ మోసగాళ్ల పని అని గుర్తించారు. అనుమానం రావడంతో వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.. ఏసీబీ సిబ్బంది ఎవరు ఇలా ఫోన్ చేయరని హెచ్చరించడంతో బాధిత రవాణాశాఖ అధికారి మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిల్స్ కాలనీ PS లో ఈ ఘటనపై ప్రస్తుతం కేసు నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఆర్టీఏ చెక్ పోస్టుల్లో జరుగుతున్న మోసాలపై ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. అధికారులు ఆకస్మిక తనికీలు నిర్వహించి ఆర్టీఏ అధికారుల అవినీతిని గుర్తించారు.. ఈ క్రమంలో ఏసీబీ అధికారుల పేరు చెబితేనే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు వెన్నులో వణుకు పుడుతోంది..

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయం ఇతరులకు తెలియకుండా. గుట్టుగా ఉంచేందుకు ఆర్టీఏ అధికారులు యత్నించారు.. మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడింది.. పోలీసుల విచారణలో ఏం తేలుస్తారో..! ఆ మోసగాళ్ళను ఎలా పసిగడతారో చూడాలి

Also read

Related posts