ఇంకో 3 రోజుల్లో ఇస్రో స్పేస్‌లోకి 100వ ఉపగ్రహం పంపబోతుంది. అయినా కొంతమంది ఇంకా క్షుద్రపూజల మాయలోనే ఉంటున్నారు. మంచిర్యాలలో క్షుద్రపూజల పేరుతో ఘరానా మోసం జరిగింది. నట్టింట్లో క్షుద్రపూజలు చేస్తే తాంత్రిక శక్తులు వస్తాయని నమ్మించిన ఓ ముఠా.. రెండు లక్షల కాజేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది.
క్షుద్రపూజలపై ఎన్ని అవగాహనలు కల్పించినా కొందరు తీరు ఏమాత్రం మారడంలేదు. అటు.. అమాయకులను అడ్డాగా చేసుకుని మోసగాళ్లు కూడా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా.. మంచిర్యాల జిల్లా పట్టణానికి చెందిన మాదంశెట్టి ప్రభంజన్ అనే యువకుడికి క్షుద్రపూజలు చేస్తే కోట్లలో డబ్బులు వస్తాయని నమ్మించింది ఓ ముఠా. దాంతోపాటు.. నట్టింట్లో క్షుద్రపూజలు చేస్తే తాంత్రిక శక్తులు వస్తాయని చెప్పారు. అయితే.. ఆయా పూజలు చేసేందుకు ఖర్చు అవుతుందంటూ మాయ మాటలు చెప్పి రెండు లక్షల రూపాయలు వసూలు చేశారు కొందరు ముఠా సభ్యులు.
ఈ క్రమంలోనే.. రెండు రోజుల క్రితం అర్థరాత్రి సమయంలో నస్పూర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీలో క్షుద్రపూజలు నిర్వహించారు. ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్న ముఠా సభ్యులపై అనుమానం రావడంతో వారి దగ్గర నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దాంతో.. కేసు నమోదు చేసి నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు నస్పూర్ పోలీసులు. క్షుద్రపూజల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారవడంతో వారి కోసం గాలిస్తున్నారు. ఇక.. క్షుద్ర పూజల వ్యవహారం బయటకు రావడంతో చుట్టుపక్కలవారు, మంచిర్యాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్షుద్రపూజలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. మూఢనమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. క్షుద్రపూజల పేరిట అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీసులు.
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025