ఉమ్మడి ఆదిలాబాద్‌లో బాలికల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చదువు, ఉద్యోగం పేరుతో బాలికలను మాయ మాటలతో తీసుకెళ్లి, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ముగ్గురు బాలికల అక్రమ రవాణా కేసులలో 12 మందిని అరెస్ట్ చేశారు.
అసలే వెనుకబడిన ప్రాంతం, ఆపై అమాయక గోండు జనం. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చదువు చెప్పిస్తామని, బతుకుపై భరోసా కల్పిస్తామని మాయ మాటలు చెప్తున్నారు. ఆపై బాలికలను తల్లిదండ్రులకు దూరంగా తీసుకెళ్తున్నారు. చదువు పేరు చెప్పి.. బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతోంది ఒక ముఠా. తాజాగా పోలీసులు వారికి చెక్ పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో బాలికల అక్రమ రవాణా కలకలరేపుతోంది. కేవలం రెండు వారాల్లో ముగ్గురు బాలికలను ఈ అక్రమ రవాణా ముఠా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అలా తీసుకెళ్లిన ముఠాలో కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. అయితే.. ఇప్పటికే అదుపులో ఉన్న వారిని పోలీసులు విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చదువుపేరు చెప్పి తీసుకెళ్తున్న బాలికలను డబ్బులకు అమ్మేస్తోంది ఈ ముఠా. తాజాగా భీంపూర్‌కి చెందిన బాలికను మహారాష్ట్ర ముఠా తీసుకెళ్లి రూ.10 వేలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో బాలికను రూ.6 వేలకు అమ్మేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల బాలికలు, మహిళలే టార్గెట్‌గా ఈ అక్రమ రవాణా సాగుతోంది. వివాహం, ఉన్నత విద్య పేరిట మాయమాటలు చెప్పి అమాయక బాలికలు, మహిళలను పక్క రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ఆదిలాబాద్ అమ్మాయిలను విక్రయిస్తున్నారు. భీంపూర్‌కు చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ అక్రమ రవాణా గుట్టు బయటపడింది.
భీంపూర్‌కి చెందిన తల్లిదండ్రులు పొలానికి వెళ్లి తిరిగొచ్చేసరికి బాలిక కనిపించలేదు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చివరకు ఈ ముఠాను పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు.. బాలికల అక్రమ రవాణా గుట్టు రట్టైంది. మొత్తం 3 కేసుల్లో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తేల్చారు. ఈ అక్రమ రవాణాలో కానిస్టేబుల్ హరిదాస్ పాత్ర ఉన్నట్లు తేల్చి అతన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ఆసిఫాబాద్ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!