November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Strange Thief: వీడు అదో టైపు.. లక్ష్య సాధన కోసం ఆ మార్గం ఎంచుకున్న విచిత్ర దొంగ..!

ఎవరైనా లక్ష్యం సాధించడం కోసం శ్రమిస్తారు. కానీ వీడు అదో టైపు.. లక్ష్య సాధన కోసం దొంగతనాలు కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ఎలాగైనా దుబాయ్ వెళ్ళాలనే సంకల్పంతో చోరీలకు బరి తెగించాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు కనబడితే చాలు ఇల్లు గుల్లే..! ఇప్పటివరకు 38 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ ఆ ఘరానా దొంగ ఎట్టకేలకు వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు.

వరంగల్ తో పాటు చుట్టు పక్కల జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు నాగరాజు అనే దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు 22లక్షల రూపాయల విలువలైన 270 గ్రాముల బంగారు అభరణాల తోపాటు, రెండు ద్విచక్రవాహనాలు, 50వేల రూపాయల నగదు, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుని లక్ష్యం విని పోలీసులు షాక్ అయ్యారు. ఎలాగైనా దుబాయ్ వెళ్ళాలని డ్రీమ్ పెట్టుకున్న నాగరాజు ఇళ్లలో దోపిడీలకు బరి తెగించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసం వుంటున్నాడు. ద్విచక్ర వాహన మెకానిక్‌గా పనిచేస్తూనే జల్సాలకు అలవాటు పడ్డాడు. మరింత పెద్ద మొత్తంలో డబ్బు సులభంగా సంపాదించాలని, ఎలాగైనా దుబాయ్ వెళ్ళాలనే ఆలోచనతో చోరీలకు పాల్పడ్డాడు.

వరంగల్, కరీంనగర్‌, కామారెడ్డి, సిద్దిపేట, వేములవాడ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గతంలో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.. జైలు జీవితం అనంతరం కూడా నిందితుడిలో ఎలాంటి మార్పు రాకపోగా, ద్విచక్రవాహనాలు చోరీలకు స్వస్తి పలికి, తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలను మొదలు పెట్టాడు. 2022 నుండి ఇప్పటి వరకు వరంగల్‌, జనగామ, సిద్దిపేట, భూపాలపల్లి, జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో మొత్తం 38కి పైగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో వరంగల్ లోని మట్టెవాడ, మీల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రెండు చొప్పున, అలాగే ఇంతేజార్‌గంజ్‌, కెయూసీ, హనుమకొండ, ఐనవోలు, నల్లబెల్లి, జనగాం, బచ్చన్నపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు ట్రైనీ ఐపిఎస్‌ అధికారి శుభం నాగ్‌ అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. చోరీలు జరిగిన ప్రదేశాల్లో లభించిన అధారాలతో పాటు ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీని వినియోగించి నిందితుడిని గుర్తించారు. చోరీ చేసిన బంగారు అభరణాలు, పెద్ద మొత్తం నగదు లభించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా, తాను చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని వరంగల్ పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

Also read

Related posts

Share via