పాఠశాల ఆవరణలో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో అపశ్రుతి చేసుకుంది. వాలీబాల్ ఆడుతూ పదో తరగతి విద్యార్ధి గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు విద్యార్ధి మరణించినట్లు ధృవీకరించారు. ఈ షాకింగ్ ఘటన వనపర్తిలో చోటు చేసుకుంది..
వనపర్తి, డిసెంబర్ 8: ఎప్పుడో 60 యేళ్లకు పలకరించవల్సిన గుండె జబ్బులు ఇప్పుడు అన్ని వయసుల వారిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. క్షణాల్లో ప్రాణాలు తీస్తున్నాయి. నెలల పసికందు నుంచి ఉడుకు రక్తంతో ఉరకలు వేసే యువత వరకు ప్రతి ఒక్కరూ ఉన్నపలంగా కుప్పకూలి మరణిస్తున్నారు. తాజాగా మరో పసి గుండె ఆగిపోయింది. పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థి వాలీబాల్ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
వనపర్తి జిల్లావ్యాప్తంగా శనివారం గ్రామస్థాయి సీఎం క్రీడా పోటీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో పామిరెడ్డిపల్లి ముందరితండాకు చెందిన సాయి పునీత్ (15) పాల్గొన్నాడు. పునీత్ బలిజపల్లి జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి శనివారం ఉదయం నుంచి క్రీడాపోటీల్లో పాల్గొన్నాడు. అయితే పాఠశాల ఆవరణలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొన్న పునీత్ శనివారం ఉదయం ఒకసారి కళ్లుతిరిగి పడిపోయాడు. దీంతో నిర్వాహకులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లి నీలమ్మ అక్కడికి చేరుకుని ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడింది. అయితే తనకు ఏమీ కాలేదని, తల్లిని ఇంటికి వెళ్లమని పునీత్ చెప్పటంతో ఆమె ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం మళ్లీ క్రీడల్లో పాల్గొన్న పునీ.. ఏం జరిగిందో తెలియదుగానీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు పునీత్ గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా.. సీఎం కప్ పోటీల్లో విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు జిల్లా కేంద్రంతో పాటు బలిజపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!