March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Telangana: అయ్యో‌ రుద్రా.. ఎంత ఘోరం జరిగిపోయింది..



ఓ పది నెలల పసికందును కూల్ డ్రింక్ మూత పొట్టన పెట్టుకుంది. కళ్లెదుటే పసి కందు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతుంటే ఆ తల్లి గుండె విలవిలాడిపోయింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ లోని ఉత్కూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వివరాలు తెలుసుకుందాం పదండి…


ఆసిఫాబాద్ జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ తన కుటుంబంతో కలిసి మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మండలం కొమ్ముగూడెంలోని బందువుల ఇంట్లో శుభ కార్యానికి హాజరయ్యారు. భార్య, పది నెలల కొడుకుతో కలిసి ఆ ఫంక్షన్‌లో సంతోషంగా గడిపారు. కానీ అక్కడే తమ జీవితాల్లో పెను విషాదం వాటిల్లబోతుందని వారు ఊహించలేకపోయారు. శుభకార్యంలో భాగంగా బందువులతో కలిసి విందులో పాల్గొన్నాడు సురేందర్.. తండ్రి సురేందర్‌తో పాటు అక్కడే ఉన్న కుమారుడు రుద్ర అయాన్ ( 10 నెలలు) ఆడుకుంటూ పక్కనే కింద పడ్డ ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు. ఆ విషయాన్ని బందువులెవరు గుర్తించకపోవడంతో.. ఒక్క క్షణంలో జరగరాని ఘోరం జరిగిపోవడానికి కారణం అయింది‌.


ఒక్కసారిగా బాలుడు కుప్పకూలడంతో గమనించిన తండ్రి సురేందర్ హుటాహుటిన బాలుడిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ అప్పటికే బాబు చనిపోయాడని వైద్యులు తెలుపడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. బాబు గొంతులో ఇరుక్కుపోయిన కూల్ డ్రింక్ మూత శ్వాస ఆడకుండా చేయడంతోనే రుద్ర అయాన్ మరణించినట్టు వైద్యులు దృవీకరించారు. ఈ ఘటనతో లక్షేట్టిపేట మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి. బాబును మొదట ఓ ప్రైవేట్ పిల్లల ఆస్పత్రికి తరలించిన సమయంలో.. అక్కడ పిల్లలతో ఉన్న తల్లులు బాబు విషాద ఘటన చూసి బోరున విలపించారు. శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న లక్షేట్టిపేట పోలీసులు విచారణ చేపట్టారు‌



Also read

Related posts

Share via