SGSTV NEWS online
CrimeTelangana

Chittoor: దివ్యాంగురాలి హత్య కేసులో క్రీడాకారుడి అరెస్టు

పెళ్లికి ఒత్తిడి చేయడంతో దారుణం! చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడి



చిత్తూరు : అతడు ఎస్బీఐలో సహాయ మేనేజర్.. దివ్యాంగుల క్రికెట్ టీమ్లో క్రీడాకారుడు. ప్రేమించి, కలిసి తిరిగిన దివ్యాంగురాలు పెళ్లికి ఒత్తిడి చేసిందని దారుణంగా హతమార్చి పోలీసులకు చిక్కాడు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలు కవిత గతేడాది డిసెంబరు 31 నుంచి కనిపించకపోవడంతో కుటుంబీకులు ఆందోళనతో వెతకడం మొదలుపెట్టారు. తాను గణేష్ అనే వ్యక్తితో వెళ్తున్నట్లు ఆమె సోదరుడికి అదేరోజున వాట్సప్లో వాయిస్ సందేశం పంపింది. తనకేమైనా జరిగితే గణేష్తో బాధ్యత అని వెంటనే మరో సందేశం పంపింది. వాటిని ఆలస్యంగా గుర్తించిన కుటుంబీకులు జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడో తేదీన గంగాధర నెల్లూరులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే గణేష్ పరారీలో ఉన్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడే హత్య చేసినట్లు వెల్లడైంది.



ఇంస్టాగ్రామ్ లో పరిచయమై..

కవితకు గతంలో ఓ వ్యక్తితో వివాహం కాగా, విడాకులు తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో గణేష్తో పరిచయమైంది. తర్వాత అది ప్రేమగా మారింది. 2024లో అతడు క్రీడా కోటాలో ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజరుగా ఉద్యోగం పొందాడు. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ఒత్తిడి చేయగా అతడు ఒప్పుకోలేదు. వివాదం రెండు, మూడుసార్లు పోలీస్ స్టేషన్కు రాగా, పెద్దల సమక్షంలో రాజీ చేశారు. అయినా పెళ్లి గురించి ఒత్తిడి పెంచడంతో గణేష్ డిసెంబరు 31న ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో ఠాణా కూడలి వద్దకు రావాలని పిలిచాడు. అక్కడ వంతెన కిందకు తీసుకెళ్లి, దివ్యాంగుల వాహనానికి ప్రత్యేకంగా అమర్చిన ఫుట్రెస్ట్ కమ్మీకి ఆమె తలను మోదాడు. కొనఊపిరితో ఉన్న ఆమెను వంతెన పైకి తీసుకొచ్చి అక్కడి నుంచి కిందకు తోసేయడంతో చనిపోయింది.

చదువులో రాణించిన గణేష్.. జేఈఈ మెయిన్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి, ఎన్.ఐ.టి. తిరుచ్చిలో చదివాడు. క్రికెట్లో పట్టు ఉండటంతో జాతీయ స్థాయికి చేరాడు. 2021లో దివ్యాంగుల క్రికెట్ లీగ్లో రాజస్థాన్ రాజ్వాడ్స్ తరఫున ఆడిన అతడు 2023లో ఇండియన్ ఇంటర్నేషనల్ దివ్యాంగుల టీమ్కు ఎంపికై ఇండియా-నేపాల్ మ్యాచ్లో ఆడాడు.

Also read

Related posts