SGSTV NEWS
AstrologySpiritual

Wealth Astrology: నీచ శుక్రుడి ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు ఖాయం..!



Venus Debilitation 2025: అక్టోబర్ 10 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు శుక్ర గ్రహం కన్యారాశిలో నీచపడుతోంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, సుఖాలు, భోగభాగ్యాలు, విలాసాలకు కారకుడైన శుక్ర గ్రహం నీచపడడం వల్ల కొన్ని రాశుల వారికి సుఖ సంతోషాలు దెబ్బతినే అవకాశం ఉండగా, మరికొన్ని రాశులకు మంచి యోగాలు, అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. శుక్రుడి వంటి గ్లామర్ గ్రహం నీచబడినప్పటికీ కొన్ని రాశుల వారిని తప్పకుండా అందలాలు ఎక్కించడం జరుగుతుంది. ధన యోగాలతో పాటు, రాజ యోగాలు కలిగే అవకాశం కూడా ఉంది. వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి జీవితం అనుకూలంగా మారి, సుఖ సంతోషాలతో సాగిపోయే అవకాశం ఉంది.


వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు నీచబడినప్పటికీ, అది పంచమ స్థానం కావడం వల్ల ఊహించని శుభ యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నైపుణ్యాలు పెంపొందుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడడం, వారికి చేదోడు వాదోడుగా ఉండడం కూడా జరిగే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమలు కొత్త పుంతలు తొక్కుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.


మిథునం: ఈ రాశికి శుక్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల దిగ్బల యోగం కలుగుతుంది. ఇక్కడ శుక్ర గ్రహానికి నీచభంగం జరుగుతుంది. అందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.  ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గి పోతాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ అందుతుంది.  గృహ, వాహన యోగాలు పట్టవచ్చు.



సింహం: ఈ రాశివారికి శుక్రుడు ధన, కుటుంబ స్థానంలో నీచబడడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. రావలసిన సొమ్ము, బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు పొందుతారు. మాటకు విలువ పెరుగుతుంది. అధికారులే కాక, బంధుమిత్రులు కూడా మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. అదనపు ఆదాయం వృద్ధి చెందడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.


వృశ్చికం: ఈ రాశివారికి శుక్రుడు లాభ స్థానంలో నీచపడుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.



ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో సంపాదన క్రమంగా పెరగడం ప్రారంభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రాజపూజ్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది.



మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు  విజయవంతం అవుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని గుర్తింపు లభించడంతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

Also read

Related posts