నవంబర్ 27న కార్తీక మాస సంకటహర చతుర్థి పర్వదినం రానుంది. ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి? ఉపవాస నియమాలు ఏమిటి? స్వామివారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? గణపతి అనుగ్రహం పొందడానికి పాటించాల్సిన పూజా విధానం తెలుసుకుందాం.
నవంబర్ 27, శుక్రవారం నాడు సంకటహర చతుర్థి పర్వదినం రానుంది. కార్తీక మాసంలో ఈ చతుర్థి రావడం విశేషంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంకటహర అంటే కష్టాలను తొలగించేది అని అర్థం. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగి, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి, గణపతిని ఆరాధించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.
సంకటహర చతుర్థి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం పూజా మందిరంలో గణపతి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. స్వామివారి ముందు దీపం వెలిగించి ఉపవాస సంకల్పం చేసుకోవాలి. రోజంతా వీలైనంత వరకు గణపతి నామస్మరణ చేస్తూ గడపాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కఠిన ఉపవాసం చేయకుండా పాలు, పండ్లు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు.
సాయంత్రం వేళ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ముఖ్యంగా గణపతికి ఎంతో ప్రీతికరమైన 21 గరికలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఉండ్రాళ్లు, మోదకాలు లేదా ఇతర ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. అనంతరం ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని 21 సార్లు భక్తితో జపించాలి. గణపతి అష్టోత్తరం చదివి హారతి ఇవ్వడం ద్వారా స్వామివారి అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు.
ఈ వ్రతంలో చంద్రోదయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాత్రి చంద్రుడు ఉదయించిన తర్వాత చంద్రుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి, గణపతిని ప్రార్థించాలి. అనంతరం సంప్రదాయ పద్ధతిలో పూజను ముగించి ఉపవాసాన్ని విరమించాలి.
ఇక ఈసారి సంకటహర చతుర్థి శుక్రవారం రావడంతో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేయవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం దీపం వెలిగించడం శుభప్రదమని నమ్ముతారు. ఇలా నియమనిష్ఠలతో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి విఘ్నేశ్వరుడి కృపను పొందవచ్చని పెద్దలు చెబుతారు.
