2026 నవంబర్ 5న రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పూజలు చేయాలి? ఉపవాస సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఏ పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
Rama Ekadashi 2026: దీపావళికి ముందు ఆశ్వయుజ మాసంలో వచ్చే రమా ఏకాదశికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఈ రోజున ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం, రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. అయితే ఈ రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని పెద్దలు సూచిస్తారు.
2026లో రమా ఏకాదశి ఎప్పుడు?
పంచాంగం ప్రకారం, 2026 నవంబర్ 4న ఉదయం 11:03 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై, నవంబర్ 5న ఉదయం 10:35 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి నియమాలను అనుసరించి నవంబర్ 5న రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. వ్రత విరమణను నవంబర్ 6, శుక్రవారం ఉదయం 6:37 నుంచి 8:48 గంటల మధ్య చేయవచ్చని పంచాంగ వివరాలు సూచిస్తున్నాయి.
విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించాలి
రమా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని భక్తితో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. విష్ణుమూర్తి కేశవ రూపాన్ని ఆరాధిస్తూ పసుపు పువ్వులు, పండ్లు, దీపం, అగరబత్తులు, తులసి ఆకులను సమర్పించవచ్చు. లక్ష్మీదేవిని కూడా పూజించి ఇంట్లో సుఖశాంతులు, సంపద, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తారు.
తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి
విష్ణుపూజలో తులసికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. రమా ఏకాదశి రోజున స్వామివారికి తులసి ఆకులను సమర్పించడం శుభంగా భావిస్తారు. అయితే సంప్రదాయం ప్రకారం ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదని చెబుతారు. అందువల్ల పూజకు అవసరమైన తులసి ఆకులను ముందురోజే కోసి సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
విష్ణు మంత్రాలు, సహస్రనామం పఠించాలి
ఈ రోజున ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని జపించడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ఆధ్యాత్మికంగా శుభప్రదంగా భావిస్తారు. వీలైన వారు విష్ణుమూర్తికి సంబంధించిన పురాణ కథలను చదవడం లేదా వినడం కూడా చేయవచ్చు.
దానం చేయడం శుభప్రదం
రమా ఏకాదశి సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడంతో పాటు పండ్లు, నిత్యావసర వస్తువులను దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. తమకు సాధ్యమైనంత మేర దానం చేయడం ద్వారా సేవాభావాన్ని చాటుకోవచ్చు.
ఈ పనులకు దూరంగా ఉండాలి
ఏకాదశి రోజున అన్నం తినకూడదనే ఆచారం ఉంది. ఉపవాసం చేసేవారు మాత్రమే కాకుండా సాధారణంగా భోజనం చేసేవారు కూడా అన్నానికి దూరంగా ఉండాలని కొన్ని సంప్రదాయాలు సూచిస్తాయి. అలాగే మాంసం, చేపలు, గుడ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారాలను తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని స్వీకరించడం మంచిదని చెబుతారు.
రమా ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకుండా ఉండటం కూడా ముఖ్యమైన నియమంగా భావిస్తారు. మొత్తం మీద ఈ రోజున శారీరక నియమాలతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ముఖ్యమని మత విశ్వాసాలు చెబుతున్నాయి.
