భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆరు రాహుకేతు దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ పూజలు చేయిస్తే మీరు అనుకున్నది జరుగుతుందని, ఎలాంటి దోషాలైనా మీ నుంచి దూరంగా పారిపోతాయని నమ్ముతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఆ ఆరు దేవాలయాలు, వాటి విశేషాలేంటో ఇక్కడ చూద్దాం…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహు కేతు పూజ చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. ఈ పూజ వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి శాంతి, ఆరోగ్యం, సంపద పెంపొందుతాయని నమ్మకం. జాతకంలో గ్రహ స్థానాలు సరిగా లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. అలాంటప్పుడు ఈ రాహు కేతు పూజ పరిష్కారంగా భావిస్తారు. జాతకంలో రాహు కేతు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు లేదా ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు రాహు కేతు దోషం ఏర్పడుతుంది. వివాహం ఆలస్యమవుతున్నా, జాతకం ఎలాంటి దోషాలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ రాహు, కేతు పూజ చేయించుకుంటే శ్రీఘ్ర ఫలితాలు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అయితే, ఈ రాహు కేతు పూజలు చాలా దేవాలయాలు, గుళ్లలో చేస్తుంటారు. కానీ, భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆరు రాహుకేతు దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ పూజలు చేయిస్తే మీరు అనుకున్నది జరుగుతుందని, ఎలాంటి దోషాలైనా మీ నుంచి దూరంగా పారిపోతాయని నమ్ముతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఆ ఆరు దేవాలయాలు, వాటి విశేషాలేంటో ఇక్కడ చూద్దాం…
శ్రీ కాళహస్తీశ్వర ఆలయం – శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది శ్రీకాళహస్తి పట్టణం. ఇక్కడి శ్రీ కాళహస్తీశ్వర ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ కైలాసంగా పిలువబడే వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది వాయులింగం. అంతేకాదు..ఈ ఆలయాన్ని రాహు-కేతు క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడికి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహు కేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహు కేతు శాంతి పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకే సారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.
ఇక్కడ మరో ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని చెబుతారు. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు కోలుస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉంటాయి. కానీ, శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు.
తిరునాగేశ్వరం నాగనాథర్ ఆలయం – తమిళనాడు

తిరునాగేశ్వరం ఆలయం తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ శివాలయం. దీనిని రాహు క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు నాగనాథర్‌గా, నాగనాథస్వామిగానూ, పార్వతీదేవి రెండు రూపాల్లో పిరయైని అమ్మన్‌గా, గిరి కుచాంబికగా లక్ష్మీ సరస్వతులతో కలిసి దర్శనమిస్తారు. రాహువు కూడా నాగవల్లి, నాగకన్ని సమేతంగా కనిపిస్తాడు. ఇక్కడకు వచ్చే భక్తులు తప్పనిసరిగా రాహుదోష నివారణ పూజలు విశేషంగా జరిపించుకుంటారు. నిరంతరం పరమశివుడిని పూజించేందుకే రాహువు ఇక్కడ వెలిశాడని చెబుతారు. ఇతర ఆలయాల్లో రాహువు సర్పముఖంతో ఉంటాడు. కానీ, ఇక్కడ మాత్రం మానవముఖంతో కనిపిస్తాడు. అంతేకాదు.. నంది కూడా ఇక్కడే శివుడిని పూజించి నందీశ్వరుడిగా మారాడట. అదే విధంగా వినాయకుడు గణాలకు అధిపతిగా ఈ ప్రాంతంలోనే గుర్తింపు పొందాడని స్థలపురాణం చెబుతోంది.
ఇక్కడ మరో అత్యంత విశేషం కూడా ఉంది.. అది అద్భుతంకంటే ఎక్కువ.. రాహుకాలంలో ఇక్కడ శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అభిషేక సమయంలో అప్పటివరకూ తెల్లగా ఉన్న పాలు శివలింగంపైన పోయగానే అవి కాస్తా నీలంరంగులోకి మారిపోతాయట. మళ్లీ ఆ పాలు నేలను చేరేసరికి తెల్లగా మారిపోతాయని చెబుతున్నారు. ఇంతటి విశేషమైన అభిషేకాన్ని చూసేందుకే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. రాహు సమయంలో నిర్వహించే పాలాభిషేకాన్ని చూసి తరించిపోతుంటారు. ఇకపోతే, చోళుల కాలం నాటి నిర్మాణశైలితో, ఆకట్టుకునే శిల్పకళా సంపదతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది తిరునాగేశ్వరం ఆలయం. శివ భక్తులు తమ జీవితంలో ఒక్కసారైన ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటారు.
శ్రీ నాగనాథస్వామి కేతు దేవాలయం – కీజాపెరుంపల్లం, తమిళనాడు

కేతు దేవాలయంగా పిలువబడే ఈ ప్రసిద్ధ ఆలయం తమిళనాడులోని పూంపుహార్ నుండి 2 కి.మీ దూరంలో ఉన్న కీలపెరుంపల్లంలో ఉంది. ఈ ఆలయం నాగనాథ స్వామి రూపంలో ఆ పరమశివుడు కొలువైన క్షేత్రం. ఇది కేతువుతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఇది ప్రసిద్ధ నవగ్రహ ఆలయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కేతువు ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయంలో, హిందూ జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలు అని పిలువబడే తొమ్మిది ఖగోళ వస్తువులలో ఒకటైన కేతువును పూజిస్తారు.ఇది కేతు దోషం దుష్ప్రభావాల నుండి బయటపడవేస్తుందని చెబుతారు. ఈ ప్రదేశంలో భక్తులు జ్ఞానం, శ్రేయస్సు, వారి జీవితాల్లో ఎదురయ్యే అన్ని అడ్డంకులు, కష్టాలను తొలగించేందుకు ఇక్కడ విశేష పూజలు జరిపిస్తుంటారు. ఇది నిరాడంబరమైన, చదునైన రాజగోపురం, రెండు ప్రాకారాలను కలిగి ఉంది. రోజువారీ పూజలు ఉదయం 6:00 నుండి రాత్రి 8:30 గంటల మధ్య రోజుకు నాలుగు సార్లు నిర్వహిస్తారు. అయితే భక్తులు మహాశివరాత్రి, మార్గళి తిరువాదిరై, ఇతర ప్రధాన పండుగల సమయంలో ఎక్కువగా వస్తుంటారు.
రాహు కేతు దేవాలయం – తెలంగాణ

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది అద్బుతమైన రాహు కేతు దేవాలయం. జిల్లాలోని బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని స్వయంభుగా వెలసిన రాహు కేతు సర్ప శయన మందిరంగా పిలుస్తార. ఇది సుమారు 500 ఏళ్ల నాటి పురాతన దేవాలయంగా ప్రసిద్ధి. ప్రతి ఆదివారం, గురువారం రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన అభిషేకం, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సకల దోషాలు తోలగిపోతాయని భక్తుల విశ్వాసం.
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామివారి ఆలయానికి కేవలం 20 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ అద్భుత ఆలయం. భారతదేశంలో మరెక్కడా ఇలాంటి గుడి లేదని చెబుతుంటారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించి రాహువు, కేతువు ప్రభావం వల్ల ఎదురయ్యే వివిధ సమస్యలను వదిలించుకోవడానికి విశేష పూజలు జరిపించుకుంటారు.
శ్రీ నీలకంఠేశ్వర ఆలయం – గెరుగంబాక్కం, చెన్నై, తమిళనాడు

తమిళనాడులో శ్రీ నీలకంఠేశ్వర ఆలయం ఉంది. ఇది చెన్నై శివార్లలోని గెరుగంబాక్కంలో ఉంది. కేతు పరిహార స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధాన దైవం శివుని అవతారమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి. పార్వతి దేవిని ఆది కామాక్షిగా పూజిస్తారు. ఈ ఆలయం గెరుగంబాక్కంలో ఉంది. కాంచీపురం జిల్లాకు చెందుతుంది. ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేక కేతు మందిరం కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కేతువుకు ప్రత్యేక పూజ, అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు చేయడం ద్వారా భక్తులు కేతువు దోషాలు, ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారని విశ్వాసం. జీవితంలో సామరస్, సుఖ సంతోషాలు, ఆర్థిక అభివృద్ధిని కోరుకునే వారు ఎక్కువగా ఇక్కడకు వచ్చి కేతు దోష పరిహారాలు చేయించుకుంటారు.
రాహు ఆలయం – ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో ఉంది ఈ ప్రత్యేక రాహు దేవాలయం. జిల్లాలోని పైథాని అనే గ్రామంలో సయోలిగాడ్ నది సంగమ ప్రదేశంలో ఈ పైథాని రాహు ఆలయం ఉంది. ఈ ఆలయంలో రాహువుతో పాటు శివుడిని కూడా పూజిస్తారు. ఈ ఆలయాన్ని ఉత్తర భారతదేశంలో ఏకైక రాహు దేవాలయంగా చెబుతారు. ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం రాహువుతో పాటు పూజలందుకుంటుంది. రాహువు తలతో పాటు, విష్ణువు సుదర్శనం కూడా ఆలయ గోడల పై చెక్కి ఉంటుంది. దీని వెనుక ఒక పురాతన కథనం కూడా ప్రచారంలో ఉంటుందవి. శ్రీ మహావిష్ణువు రాహువు తలను నరికిన తర్వాత రాహువు శిరస్సును ఇక్కడ రాళ్ల కింద పాతిపెడతాడని పురాణ కథనం ప్రచారంలో ఉంది.. ఇక్కడ పూజలు చేయడం వల్ల రాహుదోషం నుండి విముక్తి లభిస్తుందని ప్రజల నమ్మకం. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు.
Also Read
- Vijayawada Maoists: మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ కీలక వ్యాఖ్యలు
- హిడ్మా డైరీలో కీలక విషయాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు!
- మారేడుమిల్లిలో ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి!
- దిల్లీ పేలుడు : ‘ఆత్మహుతి దాడి’పై సూసైడ్ బాంబర్ సంచలన వీడియో..!
- ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన రాహు, కేతు దేవాలయాలు.. ఇక్కడ పూజ చేస్తే అన్నీ లాభాలే..!





