SGSTV NEWS online
Astrology

Weekly Horoscope: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు..12 రాశుల వారికి వారఫలాలు



వార ఫలాలు (నవంబర్ 16-22, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. స్నేహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.


మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?





మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, శుక్ర, రాహువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. వారమంతా సంతోషంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. స్నేహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మీ మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.


వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడితో పాటు నాలుగు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆర్థిక, ఆస్తి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులు కొద్దిగా ఓర్పుతో ప్రయత్నాలు కొనసాగించాలి. అనుకోకుండా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మక పోవడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.


మిథునం (మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ధన స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం, పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయవృద్ది పరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సఫలం అవుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందుతాయి. ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమై, ఎంతో ఊరట చెందుతారు. జీవిత పురోభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు, నిర్ణయాలు కార్య రూపం దాల్చుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టి ఉండడంతో పాటు చతుర్థ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆర్థిక వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ లాభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకోకుండా బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు కూడా సానుకూలంగా పురోగమిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితు లున్నాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ధన స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మొత్తం మీద వారమంతా ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు చక్కబడతాయి. అనుకో కుండా ఒకటి రెండు కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద ఖర్చు చేస్తారు. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించడం మంచిది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం ఉత్తమం.



తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడి స్వస్థానంలో, ధన స్థానంలో ధన, భాగ్య, లాభాధిపతులు, దశమ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వగైరా కారణాల వల్ల ఈ రాశివారి జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలో కూడా పురోగతి వేగం పుంజుకుంటుంది. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఆచరణలో పెడితే బాగా కలిసి వస్తాయి. ఎటువంటి ముఖ్య వ్యవహారాన్నయినా తేలికగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆద రణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో ఉండడం, భాగ్య స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటామంచి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ప్రస్తుతానికి ఇతరులకు హామీ ఉండడం, వాగ్దానాలు చేయడం ఏమంత శ్రేయస్కరం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛపట్టడం, రాహువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆస్తి, ఆర్థిక లావాదేవీల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇతరుల బాధ్యతలు మీద వేసుకో వడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, ఖర్చులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శని తృతీయంలో, ఉచ్ఛ గురువు సప్తమంలో, శుక్రుడు దశమంలో, లాభాధిపతి కుజుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా మంచి ప్రతిఫలం కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

నవమ, దశమ స్థానాల్లో శుభ గ్రహాల యుతి జరిగినందువల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగులకు ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. సీనియర్లకు పదోన్న తులు లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగి కొన్ని ప్రధానమైన అవసరాలు తీరుతాయి. ఆశలు వదిలేసుకున్నడబ్బు చేతికి అందుతుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబ వ్యవహారాల్లో కూడా జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం, భాగ్య స్థానంలో శుభ గ్రహాలు యుతి చెందడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. ఉద్యోగంలో తగిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. కొందరు బంధువులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కునే సూచనలున్నాయి. ఆర్థిక ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. అనుకూల ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది


గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also Read

Related posts