Telugu Astrology: మిథున రాశిలో ఉన్న గురు, శుక్రులతో పాటు, కర్కాటక రాశిలో ఉన్న రవి, బుధులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి మరో నెల రోజుల పాటు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధించే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారు తమ ప్రతిభా పాటవాలన్నిటినీ పణంగా పెట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకో వడం మంచిది. ఎంత ప్రయత్నిస్తే అంతగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశులవారికి రాజయోగంగా గడిచిపోయే అవకాశం ఉంది.
మేషం: అగ్ర స్థానంలో ఉండాలని కోరుకునే ఈ రాశివారు అటు ఆదాయపరంగానూ, ఇటు ఉద్యోగపరంగానూ ముందుకు దూసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొద్ది చొరవ, ప్రయత్నాలతో వీరి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో వీరి అంచనాలు నిజమై ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో తమ సమర్థతను నిరూపించుకుని, అందలాలు ఎక్కడానికి అవకాశాలు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరడం జరుగుతుంది.
వృషభం: పట్టుదలకు, ప్రణాళికలకు ప్రతిరూపమైన ఈ రాశివారు ధనాభివృద్ధికి సంబంధించి తమ ప్రతిభా పాటవాలను, నైపుణ్యాన్ని, దూరదృష్టిని పణంగా పెట్టాల్సిన అవసరం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో తమ సమర్థతను నిరూపించుకుని ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల బాట పట్టడం జరుగుతుంది. రాజీమార్గంలో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి.
మిథునం: ఈ రాశికి గురు, శుక్రులే కాక, రవి, బుధ, కేతువులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారు తమ బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాల్సి ఉంటుంది. సమయం అందుకు అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే పక్షంలో రావలసిన సొమ్ము, బాకీలు చేతికి అందడంతో పాటు, ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది.
కన్య: వ్యూహ రచనలో, ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడంలో సిద్దహస్తులైన ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఏ వ్యవహారం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను అనుకూలంగా పరిష్కరించుకోవడానికి సమయం కలిసి వస్తోంది. ఇతరుల మీద ఆధారపడకుండా సొంత ఆలోచనలతో ఆదాయ వృద్ధికి ప్రయత్నించడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడులు బాగా లాభించే అవకాశం ఉంది.
ధనుస్సు: లక్ష్య సాధనకు, కలల సాకారానికి విశేషంగా శ్రమించే తత్వం కలిగిన ఈ రాశివారికి రాశ్యధిపతి గురువుతో పాటు శుక్ర, బుధ, రవి, కుజులు కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఒక వ్యూహం ప్రకారం ఆదాయ వృద్ధికి ప్రయత్నించడం మంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కొద్ది ప్రయత్నంతో నెరవేరుతుంది.
మకరం: పట్టుదలకు, మొండి ధైర్యానికి, క్రమశిక్షణకు మారుపేరైన ఈ రాశివారు ఆదాయానికైనా, ఉద్యోగానికైనా, సమస్యల పరిష్కారానికైనా ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో నక్కతోకను తొక్కడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజీమార్గంలో ఆస్తి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025