SGSTV NEWS
Famous Hindu Temples

ప్రపంచంలో ఈ శక్తిపీఠం వెరీవెరీ స్పెషల్.. తన తలను తానే ఖండించుకున్న అమ్మవారు.. ఎక్కడంటే….?


సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధిగాంచాయి. అఖండ భారత దేశం అంటే భారతదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, టిబెట్, భూటాన్, పాకిస్తాన్ దేశాల్లో శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే ఈ శక్తిపీఠాల్లో పితానిర్ణయ తంత్రం ప్రకారం 51 పీఠాలు ప్రసిద్ధి చెందాయి తాంత్రిక శక్తిపీఠం అంటే అస్సాంలోని కామాఖ్య ఆలయం మొదట గుర్తుకు వస్తుంది. అయితే జార్ఖండ్‌లో కూడా ఇలాంటి అద్భుతమైన, మర్మమైన శక్తిపీఠం ఉందని మీకు తెలుసా? ఈ రోజు ఈ అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం..

భారతదేశంలో అనేక మర్మమైన, పురాతన దేవాలయాలు ఉన్నాయి. అటువంటి అమ్మవారి ఆలయం ఒకటి జార్ఖండ్‌లో ఉంది. రామ్‌గఢ్ జిల్లాలో రాజ్రప్పలో ఉన్న ఒక హిందూ పుణ్యక్షేత్రం ఛిన్నమస్తా దేవి ఆలయం. ఈ ఆలయం ఆధ్యాత్మిక దృక్కోణంలో ముఖ్యమైనది మాత్రమే కాదు.. సహజ సౌందర్యం, పర్యాటక దృక్కోణంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. శారదీయ నవరాత్రి పవిత్ర రోజులలో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణం భక్తితో ఉత్సాహంతో నిండిపోతుంది. ఈ రోజు శక్తివంతమైన శక్తిపీఠం ఛిన్నమస్తా దేవి ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

దశమహావిద్యలలో ఒకటి
అమ్మవారి దశమహావిద్యలు గ్రంథాలలో వివరించబడ్డాయి. వీటిలో ఛిన్నమస్తా తో పాటు కాళీ, కాల పరిణామం, తార, మాతంగి వాక్కు, వ్యక్తావ్యక్తం, త్రిపుర సుందరి, కమల, ఆనందం, సౌందర్యం, భువనేశ్వరి, ధూమావతి ఉన్నాయి. ఛిన్నమస్తా మహావిద్యలలో ఆరవదిగా పరిగణించబడుతుంది. రాజ్రప్పలోని ఆలయం ఆమెకు అంకితం చేయబడింది.

అమ్మవారి స్వరూపం ఏమిటి?
ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించబడిన మాతృ దేవత చిత్రం భక్తులలో విస్మయంతో పాటు భక్తిని కలిగిస్తుంది. దేవత తన కుడి చేతిలో కత్తిని, ఎడమ చేతిలో తన తెగిపోయిన తలను పట్టుకుని ఉంటుంది. ఆమె శరీరం నుంచి మూడు రక్త ధారలు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తాయి. రెండు ఆమె సహచరులైన డాకిని, శాకిని (జయ మరియు విజయ) లకు అంకితం చేయబడ్డాయి. మూడవది దేవత స్వయంగా అందుకుంటుంది.


అమ్మవారు కమలం పువ్వుపై నిలబడి ఉంది. ఆమె పాదాల క్రింద కామదేవుడు, రతి చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. పుర్రెల దండ, పాము దండ, వదులుగా ఉన్న జుట్టుతో అమ్మవారి రూపం బలం, త్యాగం, అసాధారణ త్యాగాన్ని సూచిస్తుంది. ఆమె ఎడమచేతిలో ఆమె కపాలంతోనే చేసిన భిక్ష పాత్ర, కుడిచేతిలో ఆమె తన శిరస్సు ఖండించడానికి ఉపయోగించిన ఖడ్గం ఉంటాయి.

దేవత ఆమె తలను ఎందుకు నరికివేసుకుందంటే
ఛిన్నమస్తా దేవి గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రబలంగా ఉంది. ఒకసారి చిన్నమస్తా దేవి తన సహచరులైన జయ ,విజయలతో కలిసి నదిలో స్నానం చేస్తుండగా.. జయ ,విజయలు అకస్మాత్తుగా చాలా ఆకలితో ఆహారం కోసం అమ్మవారిని వేడుకున్నారని చెబుతారు.

తల్లి వారిని వేచి ఉండమని కోరింది.. అయితే వారి భరించలేని ఆకలిని చూసి.. దేవత వెంటనే తన కత్తితో ఆమె తలను కట్ చేసుకుంది. అప్పుడు ఆమె మెడ నుంచి మూడు పాయలుగా రక్తం ప్రవహించింది. మూడు దిశలలో చిమ్మిన మూడు రక్తధారలలో ఒకటి జయ నోట్లోనికి, రెండవది విజయ నోట్లోనికి.. మూడవది ఖండింపబడిన పార్వతి శిరస్సు నోట్లోనికి ప్రవహించాయి. ఈ కథ అమ్మవారి అపారమైన త్యాగం, కరుణను ప్రతిబింబిస్తుంది. తల్లి తన భక్తుల అవసరాలను తీర్చడానికి ఎంతకైనా తెగిస్తుందని తెలియజేస్తుంది.

ఛిన్నమస్తా దేవి ఆలయానికి ఎలా చేరుకోవాలంటే
సమీప విమానాశ్రయం రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం.. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజ్రప్పను టాక్సీ లేదా బస్సు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. లేదా రాంఘర్ కాంట్ రైల్వే స్టేషన్, బొకారో రైల్వే స్టేషన్ ఆలయానికి సమీపంలోని ప్రధాన స్టేషన్లు. ఇక్కడ నుంచి ఆటో, టాక్సీ లేదా స్థానిక బస్సు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

వసతి సౌకర్యాలు
ఆలయం చుట్టూ ధర్మశాలలుమ, కొన్ని అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. రాంచీ, రామ్‌గఢ్ , బొకారో వంటి పెద్ద నగరాల్లో మెరుగైన హోటళ్ళు, రిసార్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Also read

Related posts