April 3, 2025
SGSTV NEWS
Astrology

April 2025 Horoscope: ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం.. 12 రాశుల వారికి మాసఫలాలు

మాస ఫలాలు (ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30, 2025 వరకు): మేష రాశి వారు కొద్దిపాటి ఆదాయానికి కూడా బాగా కష్టపడాల్సి ఉండడంతో పాటు, అనేక విధాలుగా ఖర్చులు పెరిగి చేతిలో డబ్బు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమన్నట్టుగా నెలంతా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ నెలలో ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ఏప్రిల్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఏలిన్నాటి శని ప్రారంభం కావడంతో పాటు, వ్యయ స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో యుతి చెందడం వల్ల కొద్దిపాటి ఆదాయానికి కూడా బాగా కష్టపడాల్సి ఉండడంతో పాటు, అనేక విధాలుగా ఖర్చులు పెరిగి చేతిలో డబ్బు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగంలో కూడా ప్రాభవం తగ్గే అవకాశం ఉంది. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయ మార్గాలు తగ్గకపోవచ్చు. రాశ్యధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో ఆఫర్లు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.


వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశికి లాభ స్థానంలో ఎక్కువ గ్రహాలు కొనసాగడంతో పాటు, రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారమన్నట్టుగా నెలంతా సాగిపోతుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలు గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ముఖ్యంగా వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నమైనా ఫలిస్తుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడ తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తొందరపడి ఎవరినీ నమ్మడం మంచిది కాదు. విద్యార్థులు బాగా కష్ట పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది.


మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు, ఉచ్ఛ స్థితిలో శుక్రుడితో పాటు అయిదు గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల ఈ నెలలో ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు, హోదా పెరిగే అవకాశం ఉంది. ఇష్ట మైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. మరింత మంచి ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఏక కాలంలో అనేక ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని కష్టనష్టాల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం బాగా పెరిగే అవ కాశం ఉంది కానీ, వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల శుభకార్యాలు, తీర్థయాత్రలు, ఉచిత సహాయాల మీద వ్యయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.  విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష,)

ఈ రాశికి భాగ్య స్థానాంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకృతం కావడంతో పాటు భాగ్య, లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఈ రాశివారికి నెల రోజుల పాటు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. జీవితాన్ని మలుపు తిప్పగల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతు లకు బాగా అవకాశం ఉంది. జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతాయి. రావలసిన సొమ్మంతా అప్రయత్నంగానే చేతికి అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు ఉత్సాహంగా సాగిపోతాయి.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఈ రాశికి అష్టమ స్థానంలో అయిదు గ్రహాల చేరిక వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, వేధింపులు, శ్రమ కాస్తంత ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. అయితే, అష్టమ స్థానంలో రాశ్యధిపతి రవితో పాటు ఉచ్ఛ శుక్రుడు ఉన్నందువల్ల ఆదాయం కొద్దిగా పెరిగి ముఖ్యమైన అవసరాలు తీరిపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గుతాయి. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులను కొద్ది శ్రమతో పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సానుకూలపడకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులుంటాయి విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది.


కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశికి ఈ నెలంతా రాశ్యధిపతి బుధుడితో సహా నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఏమాత్రం తీరిక ఉండదు. అనేక వ్యవహారాలను, పనులను ఏక కాలంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తారు. అనేక మార్గాల్లో ఆదా యం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా చక్కబడతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. గురువు భాగ్య స్థానంలో ఉండడం, కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి లోటుండక పోవచ్చు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.


తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశికి ఆరవ స్థానంలో అయిదు గ్రహాల యుతి వల్ల ఆర్థిక, అనారోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరు, ఎనిమిది స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగంలో విపరీత రాజయోగం కలిగింది. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. మొత్తం మీద నెలంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. రాదనుకున్న సొమ్ము కూడా చేతికి అందుతుంది. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశికి పంచమ స్థానంలో అయిదు గ్రహాల సంచారంతో పాటు, రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో ప్రవేశించడం వల్ల తప్పకుండా కొన్ని రకాల అదృష్టాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన ధన లాభం కలుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశికి నాలుగవ స్థానంలో శని, బుధ, రవి, శుక్ర, రాహువుల సంచారం వల్ల కుటుంబంలోనే కాక కెరీర్ లో కూడా సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. మానసిక ప్రశాంతతను ఇవ్వగల పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సొంత ఇంటితో సహా ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, ఇంటీ రియర్ డిజైనింగ్, వ్యవసాయం వంటి రంగాల్లో ఉన్నవారి మీద కనక వర్షం కురుస్తుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరుగుతాయి. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి ఒకటి రెండు శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి లోటుం డదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ రాశికి తృతీయ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పని భారం, పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వస్త్రాభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. కొందరు మిత్రులతో కలిసి వృత్తి, వ్యాపారాలను విస్తరించాలనే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనేక మార్గాలలో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. 


కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శనితో సహా అయిదు గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గడంతో పాటు, అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా ధనాదాయం పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులే కాక, బంధుమిత్రులు కూడా లాభపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఒకటి రెండు శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం బాగా కష్టపడే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువగా  సత్ఫలితాలే అనుభవానికి వస్తాయి. కొద్దిపాటి అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు ఎక్కువగా ఉపయోగపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు కొద్ది శ్రమతో ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉండడంమంచిది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశిలో అయిదు గ్రహాల సంచారం వల్ల ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి, ఉద్యోగాల్లోనూ, సామాజికం గానూ ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, కుటుంబ వ్యవహారాల్లో మాట తొందరపాటు వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం బాగా శ్రమపడడం జరుగుతుంది. బంధుమిత్రులకు కొద్దిగా సహాయం చేసే అవకాశం ఉంది. అయితే, ఇతరులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవ కాశం ఉంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం.

Also read

Related posts

Share via