SGSTV NEWS online
Spiritualకార్తీకపురాణం

అక్షయ నవమి ఎప్పుడు? ఈ ఒక్క పని చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయట!

అక్షయ నవమి 2026లో నవంబర్ 18న జరుపుకోనున్నారు. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం, చెట్టు కింద వంట చేసి కుటుంబంతో కలిసి భోజనం చేయడం ప్రత్యేక సంప్రదాయం. అసలు ఉసిరి చెట్టుకు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? అక్షయ నవమి వెనుక ఉన్న పురాణ విశ్వాసాలు, పూజా ప్రాముఖ్యత, దానధర్మాల గురించి తెలుసుకోండి.


అక్షయ నవమి ప్రాముఖ్యత : హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలో అనేక పండుగలు, ఉపవాసాలు, పూజలు నిర్వహిస్తారు. వాటిలో అక్షయ నవమి ఒకటి. దీనిని ఆమ్లా నవమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం, దాని కింద వంట చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని, విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.


2026లో అక్షయ నవమి ఎప్పుడు?

2026లో అక్షయ నవమిని నవంబర్ 18వ తేదీ బుధవారం జరుపుకుంటారు. నవమి తిథి నవంబర్ 18న ఉదయం 6:04 గంటలకు ప్రారంభమై, నవంబర్ 19న ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. పూజకు నవంబర్ 18న ఉదయం 6:46 నుంచి మధ్యాహ్నం 12:06 గంటల వరకు శుభ సమయంగా పరిగణిస్తారు.

అక్షయ నవమిని ఎందుకు జరుపుకుంటారు?
కార్తీక శుక్ల పక్ష నవమి రోజున అక్షయ నవమిని జరుపుకుంటారు. ‘అక్షయ’ అంటే ఎప్పటికీ నశించనిది లేదా శాశ్వతంగా ఉండేది అని అర్థం. ఈ రోజున చేసే పూజలు, జపం, తపస్సు, దానధర్మాలకు విశేష పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం. కార్తీక శుక్ల నవమి రోజున సత్యయుగం ప్రారంభమైందని పురాణ విశ్వాసం. అందుకే దీనిని సత్యయుగాది నవమి అని కూడా పిలుస్తారు.


ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు?

అక్షయ నవమి రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పురాణ కథనం ప్రకారం, ఒకప్పుడు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి, శివుడిని పూజించిందని చెబుతారు. ఆమె భక్తికి ప్రసన్నమైన ఆ ఇద్దరు దేవతలు అక్కడ ప్రత్యక్షమయ్యారని విశ్వాసం. అనంతరం లక్ష్మీదేవి అదే చెట్టు కింద వంట చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించినట్లు పురాణ కథనం చెబుతుంది. అప్పటి నుంచి అక్షయ నవమి రోజున ఉసిరి చెట్టు కింద వంట చేసి, నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే ఆచారం ఏర్పడిందని నమ్మకం. ఈ రోజున భక్తులు ఉసిరి చెట్టుకు నీరు, కుంకుమ సమర్పించి దీపాలు వెలిగిస్తారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం చెట్టు కాండానికి పవిత్రమైన దారం చుడతారు. 108 ప్రదక్షిణలు చేసే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత

అక్షయ నవమి రోజున అన్నదానం, వస్త్రదానం, ధనదానం వంటి సేవా కార్యక్రమాలను చేయడం శుభప్రదంగా భావిస్తారు. తమ శక్తికి అనుగుణంగా పేదలు, నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు, నిత్యావసర వస్తువులు అందిస్తారు. ఈ రోజున చేసే పుణ్యకార్యాల ఫలితం అక్షయంగా ఉంటుందని భక్తుల విశ్వాసం.

బ్రజ్‌లో 84 కోసుల పరిక్రమ

బ్రజ్ ప్రాంతంలో అక్షయ నవమికి మరింత ప్రత్యేకత ఉంది. ఈ రోజున బ్రజ్ 84 కోసుల పరిక్రమ ప్రారంభమవుతుందని విశ్వాసం. మధుర, వృందావన్‌తో పాటు శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ భక్తులు ఈ పరిక్రమలో పాల్గొంటారు. శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర యాత్రను నిర్వహిస్తారు.

Related posts