SGSTV NEWS
Andhra PradeshCrime

ఆస్తి వివాదం – 3 రోజులుగా తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయని కుమారులు


పల్నాడు జిల్లాలో అమానవీయ ఘటన – ఆస్తి కోసం కన్నతండ్రి దహన సంస్కారాలకు నిరాకరించిన కుమారులు

పున్నామ నరకం నుంచి కొడుకులు తప్పిస్తారనేది తరతరాల నుంచి ప్రజలు విశ్వసిస్తున్న ఓ నమ్మకం. ఆ తండ్రి కూడా నాకు ఇద్దరు కొడుకులు నాకేంటి అని సంబరపడిపోయాడు. కుమారులు ఎదుగుతుంటే వారిని చూసి మురిసిపోయాడు. కానీ మరణానంతరం తలకొరివి పెట్టడానికి వారెవరూ ముందుకు రారనే మర్మాన్ని గ్రహించలేకపోయాడు.

అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. అంత్యక్రియలు చేయాల్సిన కొడుకులు మాత్రం అందుకు మొండికేశారు. ఆస్తి పంపకాలు జరిగితే తప్ప దహన సంస్కారాలు చేయమని తేల్చి చెప్పారు. గ్రామ పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా ఇంకా ముందుకు రాలేదు. దీంతో మూడు రోజులుగా తండ్రి మృతదేహం ఇంటి ముందే పెట్టుకొని ఉన్నారు. ఈ అమానవీయ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం పాత సొలస గ్రామంలో చోటు చేసుకుంది.

మానవత్వాన్ని మరిచిన సుపుత్రులు: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం పాత సొలస గ్రామానికి చెందిన గువ్వల పెద్ద ఆంజనేయులు (85) కూలీ నాలి చేసుకొని కష్టపడి కుటుంబాన్ని అభివృద్ధి చేశారు. 20 ఎకరాల పొలం చేకూర్చారు. పదేళ్ల క్రితం భార్య చనిపోయింది. ఇద్దరు కుమారులు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ఇద్దరు కుమార్తెలు మల్లీశ్వరి, అనసూయమ్మలు. వీరిలో పెద్ద కుమారుడు నాగేశ్వరరావు కులాంతర వివాహం చేసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నాడు. ఉన్న ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించారు.

ఆస్తి కోసం గొడవ: చిన్న కుమారుడు శ్రీనివాసరావు వివాహం చేసుకొని స్వగ్రామంలోనే ఉంటున్నాడు. తండ్రి పెద్ద ఆంజనేయులు చిన్న కుమారుడు వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో తండ్రి పెద్ద ఆంజనేయులు మూడు రోజుల క్రితం మృతి చెందాడు. దీంతో పెద్ద కుమారుడు నాగేశ్వరరావు గ్రామానికి వచ్చి ఆస్తిలో తన వాటా తనకి ఇవ్వాలనీ, ఆ తర్వాతే అంత్యక్రియలు జరుగుతాయని తెగేసి చెప్పాడు. గతంలో రెండు ఎకరాలు ఇచ్చామనీ, అన్ని బాధ్యతలు తాను చూస్తున్నప్పుడు ఇంకా ఇవ్వలేమని చిన్న కుమారుడు శ్రీనివాసరావు సమాధానమిచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వివాదం జరిగి అంత్యక్రియలకు పాడిపై పెట్టిన తండ్రి మృతదేహాన్ని ఇంటిముందే నిలిపివేశారు. మూడు రోజులుగా గ్రామంలోని పెద్దలు సర్ది చెబుతున్నా పరిష్కారం కాలేదు. దీంతో సమస్య పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు గ్రామానికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించకపోతే తామే మృతదేహాన్ని పంచాయతీకి అప్పగిస్తామని చెప్పారు. అయినా మంగళవారం సాయంత్రం వరకు ముందుకు రాలేదు. ఆస్తుల కోసం కన్నతండ్రికి అంత్యక్రియలు నిర్వహించకుండా కుమారులు మానవత్వాన్ని మంట కలిపారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల దృష్టికి పంచాయతీ: గత మూడు రోజులుగా గ్రామంలోని పెద్దలు సర్ది చెబుతున్నప్పటికీ సమస్య ఏ మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో ఈ వివాదం పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు గ్రామానికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించకపోతే తామే మృతదేహాన్ని పంచాయతీకి అప్పగిస్తామని చెప్పారు. అయినప్పటికీ మంగళవారం సాయంత్రం వరకు ముందుకు రాలేదు. ఆస్తుల కోసం కన్నతండ్రికి అంత్యక్రియలు నిర్వహించకుండా కుమారులు మానవత్వాన్ని మంట కలిపారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Also read

Related posts