SGSTV NEWS online
CrimeTelangana

అమ్మనవుతాననుకుంది.. ఆయువే పోయింది!



గర్భిణిని షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్చిన భర్త చివరి నిమిషంలో హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించిన వైద్యులు అక్కడికి వెళ్లేలోపే తల్లీబిడ్డల మృతి

షాద్ నగర్ , కొందుర్గు, : బిడ్డకు జన్మనివ్వబోతున్నానన్న ఆనందంతో
ఉదయం నవ్వుతూ ఆసుపత్రికి వచ్చిందా ఇల్లాలు. ప్రసవానికి వెళ్లే ముందు భర్తతో సెల్ఫీ కూడా దిగింది. సాయంత్రం సమయంలో తమ వల్ల కాదంటూ వైద్యులు చేతులెత్తేయగా.. హైదరాబాద్కు వెళ్లేలోపే శిశువుతో సహా తల్లి ప్రాణాలు కోల్పోయింది. షాద్నగర్లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో చోటుచేసుకున్న దారుణం.. శనివారం వెలుగులోకి వచ్చింది.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రమేష్ భార్య రాధ(28) నిండు గర్భిణి. పురిటి నొప్పులు మొదలవడంతో భర్త శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో షాద్నగర్లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పి వైద్య సేవలు ఆరంభించారు. సాయంత్రం 4 గంటల సమయంలో పరిస్థితి విషమించిందంటూ సీపీఆర్, ఇతర వైద్య సేవలు చేశారు. చివరికి హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. భర్త, బంధువులు హుటాహుటిన ఆమెను పేట్లబురుజులోని ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లితోపాటు కడుపులోని శిశువు మరణించినట్లు వైద్యులు నిర్దారించడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

వైద్యుల నిర్లక్ష్యమే తల్లీబిడ్డల చావుకు కారణమంటూ మృతదేహంతో కమ్యూనిటీ ఆసుపత్రి ఎదుట అర్ధరాత్రి తర్వాత ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ వ్యవహారంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ‘నొప్పుల సమయంలో ఫిట్స్ రావడంతో గర్భిణి పరిస్థితి విషమించిందని, ఆమెను బతికించేందుకు ఐదుగురు వైద్యులు ప్రయత్నించారని’ తెలిపారు. జిల్లా వైద్యాధికారిణి అనురాగిణి రెడ్డి శనివారం తల్లీబిడ్డల మృతి ఘటనపై విచారణ జరిపారు. ఘటనపై కలెక్టర్కు నివేదిక పంపుతానని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆడపిల్ల పుడుతుందని అల్లుడు అబార్షన్ చేయించాడు’

ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలో ‘తన కుమార్తెకు ఆడబిడ్డ పుట్టబోతోందని తెలుసుకున్న అల్లుడు గతంలో అబార్షన్ చేయించాడంటూ’ మృతురాలు రాధ తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. భార్యాబిడ్డలు చనిపోయి భర్త రోధిస్తున్న సమయంలో మృతదేహాన్ని కూడా చూడనివ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన తరపు బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also read

Related posts