పుట్టపర్తికి సంబంధించిన కథ మీకోసం!
Puttaparthi Significance And History
భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. మన దేశంలోని ఆధ్యాత్మిక సంపదకు, ప్రశాంతతకు ముగ్ధులైన ఎందరో విదేశీయులు సైతం మన దేశంలోనే స్థిర నివాసం ఉన్నారు. ఇటు దేవతలతో పాటు మత గురువులను, పెద్దలను దైవ స్వరూపాలు గా భావించి పూజించడం మనదేశ సంప్రదాయం. అలాంటి వారిలో షిర్ది సాయినాథుడు, పుట్టపర్తి సాయిబాబా, అక్కల్కోట్ మహారాజ్, గానగాపురంలో వెలసి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటివారు అగ్రగణ్యులు. నవంబర్ 23, పుట్టపర్తి శ్రీ సత్యసాయి జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పుట్టపర్తి ఎక్కడుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పుట్టపర్తి వెలసి ఉంది. సముద్ర మట్టానికి 475 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణాన్ని ఒకప్పుడు గొల్లపల్లి అని పిలిచేవారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న పుట్టపర్తి పట్టణం, ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా ప్రభావంతో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఎందరో దేశవిదేశీయులను ఆకర్షించింది.
పుట్టపర్తి చరిత్ర
పుట్టపర్తి పట్టణాన్ని గతంలో గొల్లపల్లి అని పిలిచేవారు. ఆ గ్రామంలో ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన పెద్ద వెంకప్ప, ఈశ్వరమ్మ దంపతులకు నవంబర్ 23, 1926వ సంవత్సరంలో సత్యనారాయణ రాజు అనే కుమారుడు జన్మించాడు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయని స్థానికులు చెప్పుకుంటారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు సత్యనారాయణ రాజు చిన్న వయసు నుంచే పేదల పట్ల ఆదరణ చూపించే వాడు.
విద్యాభ్యాసం
పుట్టపర్తికి సమీపంలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సత్యనారాయణ రాజు ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయసులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచాడు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు.
వింత ప్రవర్తన
సత్యనారాయణ రాజు 1940 మార్చి 8న కొంత విచిత్రమైన ప్రవర్తన కనబరచాడు. ఏదో తెలు కుట్టినందున ఇలా ప్రవర్తిస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సంఘటన తరువాత అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగాయి. ఎప్పుడూ సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాడు.
షిర్డీసాయి అవతారమని ప్రకటన
సత్యనారాయణ రాజు 1940లో తాను షిరిడీ సాయిబాబా అవతారమని ప్రకటించారు. అదే పేరు తనకు పెట్టుకున్నారు. ఆనాటి నుంచి సత్యనారాయణ రాజు పుట్టపర్తి సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు.
ఎప్పుడూ ధ్యానంలో
1940 అక్టోబరు 20లో, తన 14 యేండ్ల వయసు అప్పుడు, తన పుస్తకాలు వదిలేసి, “నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది” అని చెప్పాడు. తరువాత మూడేండ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు.
ప్రేమ సాయి మూర్తిగా
శ్రీ పుట్టపర్తి బాబావారు 1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తి ల అవతారమని ప్రకటించాడు. అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పాడు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించాడు. అలా ఆయన పుట్టపర్తి సత్యసాయి బాబాగా ప్రపంచ స్థాయిలో ఖ్యాతిగాంచారు.
దేశానికే తలమానికం – పుట్టపర్తి ప్రశాంతి నిలయం
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి దేశానికే తలమానికం. చిత్రావతి నది ఒడ్డున ఉన్న పుట్టపర్తిలో 1950లో ప్రశాంతి నిలయం ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో నిర్మించిన ప్రశాంతి నిలయానికి సత్యసాయి బాబే ఆర్కిటెక్ట్, ఇంజినీరుగా వ్యవహరించారని చెబుతారు. ప్రశాంతి నిలయం ఏర్పాటైన నాటి నుంచి పుట్టపర్తిలో సందర్శకుల తాకిడి పెరిగింది.
పుట్టపర్తి సేవా కార్యకలాపాలు
ఆధ్యాత్మిక సేవ
సత్యసాయి బాబా బోధనల ప్రకారం సేవ అనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధన అని నమ్ముతారు. ప్రశాంతి నిలయంలో భజనలు, ప్రవచనాలు, యజ్ఞాలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతుంటాయి.
సామాజిక సేవ
సత్యసాయి సేవా సంస్థలు సామాజిక సేవలను కూడా అందిస్తాయి. ఇవి ప్రజలకు విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ వంటి కార్యక్రమాలను ఉచితంగా అందిస్తాయి.
అత్యవసర సేవలు
విపత్తులు సంభవించినప్పుడు సత్యసాయి సేవా సంస్థలు సహాయక చర్యలలో పాల్గొంటాయి. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం చేయడానికి అనేక సేవలు అందిస్తాయి.
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు
భగవాన్ఈ శ్రీ సత్యసాయి ఏర్పాటు చేసిన అనేక సేవా సంస్థలు మతం, కులం, వర్గానికి అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
పుట్టపర్తిలో దర్శనీయ స్థలాలు
పుట్టపర్తిలోని చిత్రావతి నది ఒడ్డున ఉన్న వృక్షం, విశ్వవిద్యాలయం వైపు ఉన్న కొండ మీద ఉన్న ధ్యానం చెట్టును భక్తులు సందర్శిస్తుంటారు. అలాగే సత్యసాయి ఆశ్రమం, చైతన్య జ్యోతి మ్యూజియం, కోరికలు తీర్చే కల్ప వృక్షం, శ్రీసత్యసాయి స్పేస్ థియేటర్, ఆశ్రమంలోని ధాన్య వృక్షం, ఆంజనేయస్వామి ఆలయం, గోకులం, గణేష్ గేట్, సత్యసాయి హిల్ వ్యూ స్టేడియం, సంతాన సంస్కృతి, తదితర ప్రాంతాలను కూడా సాయి భక్తులు సందర్శిస్తుంటారు.
బాబా విడిది చేసిన ప్రదేశాలు
సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరు లోని “బృందావనం” ఆశ్రమంలో గడిపేవారు. ఎప్పుడైనా కొడైకెనాల్ లోని “సాయి శృతి ఆశ్రమం”కి వెళ్లేవాడు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు, సేవా కార్యక్రమాలు చేసిన శ్రీ సత్యసాయి 2011 ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 కి తుది శ్వాస విడిచాడు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఏప్రిల్ 27 వ తేదీన బుధవారం ఉదయం మహా సమాధి జరిగింది. ఈనాటికీ ప్రశాంతి నిలయంలోని బాబా సమాధిని దర్శించడానికి ఎందరో భక్తులు విచ్చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు భజనలు చేయడం, ఆయన బోధనలను పఠించడం, సమాజ సేవ చేయడం, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు.
ఎన్నో మహిమలు చూపి, మరెన్నో ఆధ్యాత్మిక బోధలు చేసిన శ్రీ సాయిబాబా సమాజహితానికి పాటుపడ్డారు. బాబావారు చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. ప్రస్తుతం శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా మనం కూడా పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని దర్శిద్దాం. ఆధ్యాత్మిక ప్రశాంతత పొందుదాం.
