SGSTV NEWS
CrimeTelangana

Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య

మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం



సత్తెనపల్లి: రూ.50 వేల అప్పు విషయమై ఏర్పడిన వివాదం రెండు ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పణిదం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రామనాథం శ్రీనివాసరావు కిరాణా దుకాణం నిర్వహణతో పాటు పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లుకు ఏడాది క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చారు. తిరిగి చెల్లించే విషయంలో వెంకటేశ్వర్లు తాత్సారం చేయడంపై ఇద్దరి మధ్య తరచూ వాదనలు జరిగాయి. మంగళవారం రాత్రి శ్రీనివాసరావు భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్తో కలిసి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి అప్పు విషయమై నిలదీశారు. తీవ్ర వాదనల నేపథ్యంలో ‘ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబంపై కేసు పెడతానంటూ’ వారి ఎదుటే వెంకటేశ్వర్లు పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు ఆయన్ను సత్తెనపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఊహించని ఆ ఘటనతో తల్లీ కుమారుడు ఇంటికి చేరి, ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయాన్నే శ్రీనివాసరావు, ఆయన భార్య, కుమారుడు పొలానికి వెళ్లారు. వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి విషమించి, గుంటూరు ఆసుపత్రికి తరలించారనే సమాచారం వారికి తెలిసింది. భయాందోళనకు గురై.. శ్రీనివాసరావుతో ఆయన భార్య, కుమారుడు వాదనకు దిగారు. ఆయన చేసిన అనవసరమైన పనుల వల్లే ఈ దుస్థితి నెలకొందని వాదించారు. ‘నన్నే తప్పు పడుతున్నారా.. అయితే చచ్చిపోతా.. మీరుండండి’ అంటూ శ్రీనివాసరావు హడావుడిగా ఇంటికి వచ్చి, పురుగు మందు తాగారు. ఆ విషయాన్ని భార్య, కుమారుడికి చెప్పారు. తీవ్ర ఆందోళనకు గురైన తల్లీ కుమారుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్ణకుమారి (40), వెంకటేశ్ (25) మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Also read

Related posts

Share this