విజయవాడ: గాదె సాయికృష్ణ మరణానికి కారణాన్ని సిట్ అధికారులు కోర్టు ముందు బయటపెట్టారు. కృష్ణలంక స్టేషన్ అప్పటి సీఐ నాగరాజు.. సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడని సిట్ అధికారులు విజయవాడ కోర్టుకు నివేదించారు. సీఐ నాగరాజుతో పాటు మరో ఆరుగురు నిందితులపై విజయవాడ కోర్టులో అభియోగ పత్రం (ఛార్జిషీట్) దాఖలు చేశారు.
ఓ ఉన్నతాధికారి ఆమోదంతోనే సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు తెచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఛార్జిషీట్లో తెలిపింది. అప్పటినుంచి చనిపోయేవరకు సీఐ నాగరాజు, మరికొందరి చేతిలో సాయికృష్ణ దారుణ హింసకు గురయ్యాడని తెలిపింది. 86 పేజీల ఛార్జిషీట్‌తో పాటు 263 డాక్యుమెంట్లను కోర్టుకు సిట్ సమర్పించింది. 120 మంది సాక్షులను విచారించినట్లు అందులో పేర్కొంది
ఉన్నతాధికారి ఆమోదంతో సాయికృష్ణను తెచ్చారు
అధికారి ‘మే 5న నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న వారిని తీసుకు వచ్చేందుకు అదనపు సిబ్బంది కావాలని సీఐ నాగరాజు కీలక స్థానంలో ఉన్న ఉన్నతాధికారిని కోరారు. అనుమతినివ్వడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదే రోజు రాత్రి పది గంటలకు బయలుదేరి తెల్లవారుజాము 3.30 గంటలకు మార్కాపురం చేరుకున్నారు. అక్కడ పెయింటింగ్ పనిచేస్తూ బతుకుతున్న సాయికృష్ణను పట్టుకొచ్చి ఉదయం 8 గంటలకు కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని టాస్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్లో కూడా నమోదు చేశారు. కృష్ణలంక సీఐ నాగరాజు, మరికొందరు కానిస్టేబుళ్లు కలిసి సాయికృష్ణను స్టేషన్ లోని రెండో అంతస్తుకు తీసుకువెళ్లి అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో అతను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హెడ్‌కానిస్టేబుల్ తీశారు’ అని సిట్ అధికారులు చార్జిషీట్లో స్పష్టం చేశారు.
మూడు రోజుల తరువాత కూడా హింసను ఆపలేదు
‘కృష్ణలంకలోని ఆర్ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి చికిత్స చేయించారు. మూడు రోజుల తర్వాత గుణదలలో గంజాయి విక్రేతలను పట్టుకునేందుకు సాయికృష్ణను సీఐ నాగరాజు తదితరులు వారి వెంట తీసుకెళ్లారు. అయితే ఈ లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లో సాయి కృష్ణకు సంబంధించిన వివరాలను ఎక్కడా నమోదు చేయలేదు. ఆ తరువాత కూడా నాగరాజు తదితరులు సాయికృష్ణపై హింసను ఆపలేదు. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టడంతో రక్తస్రావం జరిగి సాయికృష్ణ మృతిచెందాడు. అనంతరం కృష్ణలంక స్టేషన్లో సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారు. స్టేషన్లో ఎక్కడా ఎలాంటి మరకలు లేకుండా పెయింట్లు వేయించారు. లాకప్‌లో సాయికృష్ణ ఆనవాళ్ళు లేకుండా కడిగేశారు’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు.
దుప్పట్లో చుట్టి.. దహనం చేశారు…
‘కస్టోడియల్ టార్చర్ తరువాత పోలీసుస్టేషన్లో సాయికృష్ణ ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని ఓ పాత భవనానికి తరలించారు. అక్కడ సాయికృష్ణ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి దహనం చేశారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చిన నాటి నుంచి చనిపోయేంత వరకు కృష్ణలంక స్టేషన్లో ఉన్న కీలక ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు కీలకంగా వ్యవహరించారు. ఇందులో సీఐ సహా ఆరుగురు పోలీసులు కాగా ఒకరు సీఐ స్నేహితుడు సురేష్. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.’ అని అధికారులు వివరించారు.
చంపిన తరువాత సెల్‌ఫోన్‌ను గోవా పంపి ఫోన్లు చేయించారు..
‘కృష్ణలంక పోలీసుస్టేషన్ లోపల, బయట కలిపి 10 సీసీ కెమేరాలు ఉన్నాయి. 18 నెలలపాటు స్టోరేజి ఉండేలా నాలుగు 8 టీబీ హార్డుడిస్కులు ఉన్నాయి. వీటిల్లోని ఆధారాలను సీఐ నాగరాజు ఆదేశాలతో చెరిపివేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇక సాయికృష్ణ చనిపోయిన తర్వాత అతని సెల్‌ఫోన్‌ను ఒక వ్యక్తికి ఇచ్చి గోవాకు పంపారు. అక్కడి నుంచి ఫోన్ కాల్స్ చేయించారు. తద్వారా సాయికృష్ణ ఇంకా బతికే ఉన్నాడనే అభిప్రాయం కల్పించే ప్రయత్నం చేసినట్లు కూడా మా దర్యాప్తులో తేలింది’ అని పేర్కొన్నారు.
అన్ని ఆధారాలు సేకరించాం..
‘2026 మే 23న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద లభించిన రెండు గుర్తు తెలియని మృతదేహాల వ్యవహారాన్ని కూడా విచారించాం. ఆ మృత దేహాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా స్వర్గపురి శ్మశానవాటికకు తరలించారు. కృష్ణలంక పోలీస్టేషన్‌లోని సీసీటీవీ వ్యవస్థకు సంబంధించిన డీవీఆర్, ఎన్వీఆర్, హార్డ్ డిస్కులు, మెమొరీ కార్డులు, మొబైల్ ఫోన్లు, పోలీస్ స్టేషన్ రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ సైన్స్ లా» రేటరీ సిబ్బంది కూడా నేర స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించింది. పోలీస్టేషన్లో సాయికృష్ణ ఉన్నట్లు తెలిపిన వ్యక్తులు, ఆయనతో సంబంధం ఉన్నవారు, సాంకేతిక ఆధారాలకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశాం’ అని సిట్ అధికారులు చార్జిషీట్లో తేల్చి చెప్పారు.
నమోదు చేసిన సెక్షన్లు ఇవే..
బి ఎన్ ఎస్ 103(1), 127(4), 127(6),305. 238,316(5), 61(2) 8 2 3(5) తో పాటు ప్రభుత్వం ఆస్తులు ధ్వంస నిరోధక చట్టం 1984లోని సెక్షన్ 3, సమాచార సాంకేతిక చట్టం – 2000లోని 65, 66 సెక్షన్లను కూడా చేర్చారు. సాయికృష్ణను పోలీసుల అదుపులోకి తీసుకున్న పరిస్థితులు, కస్టడీలో ఆయనకు జరిగినట్లు ఆరోపిస్తున్న చిత్రహింసలు, లాకప్ రికార్డుల నిర్వహణ, మొబైల్ ఫోన్ వినియోగం, సీసీ టీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ నివేదికలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ ఛార్జిషీట్ లో పూర్తిగా సీఐ నాగరాజు అతని సిబ్బందిని ఇరికించే విధంగా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ప్రమేయాన్ని కప్పి పుచ్చేందుకే, పాడుబడిన భవనంలో సాయికృష్ణ చనిపోయినట్లు సిట్ పేర్కొన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
Also read
- పాతబస్తీలో మహిళ దారుణ హత్య.. బట్టల దుకాణంలో కత్తితో దాడి.. కారణం ఏంటంటే..
- ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ, మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు..
- మహిళా న్యాయవాదిపై జనసేన నేత లైంగిక దాడి
- సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టారు
- దేవి నవరాత్రులు మొదలు దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!





