SGSTV NEWS
CrimeTelangana

Road Accident: కాటేసిన కాలం..కల్యాణానికి ముందే దుర్మరణం

కాలం బలీయమైనది.. తాము ఒకటి తలిస్తే.. తానొకటి చేస్తుంది.. అలాంటి ఘటన ములకలపల్లి మండలం కొత్తూరు శివారులో సోమవారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది.


అశ్వాపురం, : కాలం బలీయమైనది.. తాము ఒకటి తలిస్తే.. తానొకటి చేస్తుంది.. అలాంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కొత్తూరు శివారులో సోమవారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి తాటి ప్రసాద్, నాగమణిలు దుర్మరణం చెందారు.

అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన కృష్ణయ్య, ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారిలో రెండో వ్యక్తి తాటి ప్రసాద్(25). ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకొనే ప్రసాద్కు కొద్ది రోజుల క్రితం ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన పత్రి నాగమణితో వివాహం  నిశ్చయమైంది. నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వ్యవసాయం పనులు పూర్తయిన తర్వాత మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం, వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆనాటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కొనసాగుతున్నాయి.

నాగమణి తండ్రి వెంకన్న, తల్లి లింగమ్మ. వారికి నాగమణి ఒక్కరే కుమార్తె. నాగమణికి తండ్రి లేరు. తల్లి మాత్రమే ఉన్నారు. వారిది కూడా వ్యవసాయమే. నాగమణి తండ్రి లేకపోవడం, తనకు సొంత ట్రాక్టర్ ఉండటంతో ప్రసాద్ వారికి వ్యవసాయ పనుల్లో సహకరిస్తున్నాడు. అందుకోసం ట్రాక్టర్ తీసుకొని ఆదివారం కమలాపురం గ్రామానికి వెళ్లాడు. అక్కడే ఉండి తన ట్రాక్టర్తో వారి వ్యవసాయ పనులకు తోడ్పడుతున్నారు. సోమవారం రాఖీ పండుగ కావడంతో తుమ్మలచెరువు నుంచి ప్రసాద్ సోదరి, పలువురు తాము రాఖీలు కట్టడం కోసం సిద్ధంగా ఉన్నామని, వెంటనే రావాలని ఒత్తిడి చేశారు. వస్తానని చెప్పిన ప్రసాద్ వీలుకాక రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తన  ట్రాక్టర్పై అశ్వాపురం బయలుదేరాడు. తర్వాత నాగమణి గ్రామంలోని వేరొకరి వాహనంపై ప్రసాద్కు ఎదురుగా వెళ్లి ఇంత రాత్రివేళ ట్రాక్టర్పై ఒక్కరే ప్రయాణం చేయవద్దని, వర్షం వస్తుందని, మరుసటి రోజు వెళ్లవచ్చని సర్ది చెప్పి తాను కూడా ట్రాక్టర్ ఎక్కి కూర్చుంది. తర్వాత వారిద్దరూ వెనుతిరిగి ట్రాక్టర్పై బయలుదేరి కమలాపురం వస్తున్నారు. దంతెలబోరు నుంచి ములకలపల్లి మార్గంలో కొత్తూరు వద్ద దురదృష్టవశాత్తు వారి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రసాద్, నాగమణి ఇద్దరూ అక్కడికక్కడే ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందారు. ఫలితంగా ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Also read

Related posts

Share this