July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు

మెట్‌పల్లిలో పోలీసులతో వడ్డీ వ్యాపారి వాగ్వాదం

జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌ సంస్థలపై పట్టణ సీఐ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. కాసారపు రాజయ్య వద్ద రూ.56.35 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.4 లక్షలు, లవంగ రాజేందర్‌ వద్ద రూ.70 వేలు, రూ.1.58 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రమేశ్‌ వద్ద 28 ప్రామిసరీ నోట్లు, రెండు ఖాళీ చెక్కులు, అరవింద్‌ వద్ద 29 ఖాళీ చెక్కులు, రూ.2.50 లక్షల విలువైన మార్టిగేషన్‌ పేపర్లు, కడెం వెంకవ్వ వద్ద రూ.21.43 లక్షల విలువైన 56 ప్రామిసరీ నోట్లు, రూ.85 వేలు పట్టుకున్నట్లు తెలిపారు.

దాడుల్లో ఎస్సైలు నరేశ్‌కుమార్‌, మన్మధరావు, ఏఎస్సై వేణురావు, సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మోతె, టీఆర్‌నగర్‌ గ్రామాల్లోని నలుగురు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై సదాకర్‌ తెలిపారు. టీఆర్‌నగర్‌కు చెందిన పెద్ద సారయ్య ఇంట్లో రూ.1.19 లక్షలు, 129 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు.

ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండలంలోని గోధూర్‌, సత్తక్కపల్లి గ్రామాల్లో శనివారం ఎస్సై అనిల్‌ ఆధ్వర్యంలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. గోధూర్‌లో బండి పురుషోత్తం ఇంట్లో రూ.8.33 లక్షల విలువైన 17 ప్రామిసరీ నోట్లు, రూ.3 వేల విలువైన బ్లాంక్‌ చెక్‌, 23 చిన్న నోటు పుస్తకాలు, 2 మీడియం నోటు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సత్తక్కపల్లిలో ఆరెళ్ల రాజగౌడ్‌ ఇంట్లో రూ.36.45 లక్షల విలువైన 18 ప్రామిసరీ నోట్లు, చిన్న బుక్స్‌ 18, మీడియం బుక్‌ 1, లాంగ్‌నోట్‌ బుక్‌ 1, రూ.1.69 లక్షలు పట్టుకున్నారు. వాటిని సీజ్‌ చేసి, ఆ ఇదరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రాయికల్‌(జగిత్యాల): మండలంలోని ఇటిక్యాల, అల్లీపూర్‌ గ్రామాలకు చెందిన వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. అల్లీపూర్‌లోని రాజు ఇంట్లో రూ.1.80 లక్షలు, ఇటిక్యాలలోని శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో రూ.18 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు లభ్యమైనట్లు తెలిపారు.

ధర్మపురి: స్థానిక 9 మంది వడ్డీ వ్యాపారుల ఇళ్లలో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.6.23 లక్షలు, 65 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపడుతున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వడ్డీ వ్యాపారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మల్లాపూర్‌(కోరుట్ల): మండలంలోని రేగుంట, మొగిలిపేట గ్రామాలకు చెందిన పలువురి ఇళ్లలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతి, లైసెన్స్‌ లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు చేశామని ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. అయితే, పోలీసులకు నగదు, ఎలాంటి అప్పు పత్రాలు లభించలేదని తెలిసింది.

కోరుట్ల: కోరుట్లకు చెందిన 12 మంది వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. అరిసెల్లి రాజేశం ఇంట్లో రూ.1.28 లక్షలు, రూ.69 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు స్వాధీ నం చేసుకున్నట్లు సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌ తెలిపారు.

మెట్‌పల్లి: పట్టణానికి చెందిన పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. సీఐ నవీన్‌, ఎస్సై చిరంజీవి, పోలీసు సిబ్బంది ర్యాగల్ల వెలయేశ్వర్‌, వేముగంటి భూమేశ్వర్‌, ధ్యావనపల్లి రాజారాం ఇళల్లో రూ.5 లక్షలు, రూ.87 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, 26 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమో దు చేశారు. అలాగే, కట్కం రమేశ్‌ ఇంట్లో సోదా లకు వెళ్లగా అతను పోలీసులను అడ్డుకొని, వాగ్వాదానికి దిగాడు. ఒక దశలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినప్పటికీ పోలీసులు రమేశ్‌ ఇంట్లోకి వెళ్లి, తనిఖీలు చేపట్టారు. బంగారం తాకట్టు పెట్టుకొని, అప్పులు ఇచ్చే ఇతను గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జరిపిన సోదాల్లో కూడా భారీ గా బంగారం పట్టుబడినట్లు తెలిసింది. ఈ తని ఖీలను ఎస్‌బీ డీఎస్పీ రవీందర్‌ పర్యవేక్షించారు.

బుగ్గారం(ధర్మపురి): మండలంలోని వెల్గొండ, శెకెల్ల గ్రామాలకు చెందిన వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. అప్పు పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నామని, శెకెల్లకు చెందిన బంక వెంకటేశం, వెల్గొండకు చెందిన వెంకటరాజంలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

జగిత్యాల జిల్లాలోని పలుచోట్ల నగదు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Also read

Related posts

Share via