March 12, 2025
SGSTV NEWS
CrimeTelangana

Pranay Murder Case : లవ్ మ్యారేజ్ టు మర్డర్.. అమృత-ప్రణయ్ ప్రేమ కథలో ఏం జరిగింది?

కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. తండ్రి పరువు కత్తితో పడగవిప్పాడు. ఫలితంగా నడిరోడ్డుపై నిండు ప్రాణం పోయింది. పగ చల్లారింది అనుకున్న తండ్రి.. తనువు చాలించాడు. ఇప్పుడు కూతురు.. అటు తండ్రి, ఇటు భర్తను కోల్పోయి.. కుమారుడితో జీవిస్తోంది.


అమృత- ప్రణయ్ లవ్ స్టోరీ.. విషాదాంతమైన ప్రేమ కథ. అమృత, ప్రణయ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారింది. ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు. ప్రణయ్ కుటుంబంలో ఒప్పుకున్నారు. కానీ.. కూతురును అమితంగా ప్రేమించే మారుతీరావు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఘనంగా రిసెప్షన్ జరిపించారు.


మారుతీరావు వార్నింగ్..
కానీ.. అమృత తండ్రి మారుతీరావు మాత్రం.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కూతురును తనకు దూరం చేసిన ప్రణయ్‌పై ఎలాగైన పగ తీర్చుకోవాలి రగిలిపోయాడు. అమృత తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేది. తల్లితో మాట్లాడుతూ.. తన రిసెప్షన్ జరిగిన తీరును వివరించింది. తన రిసెప్షన్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే.. వేలాది మంది చూశారని అమృతి అప్పట్లో చెప్పినట్టు తెలిసింది. దీనికి తండ్రి మారుతీరావు బదులిస్తూ.. ‘నేను వాడిని చంపే వీడియోను లక్షలాది మంది చూస్తారు’ అని వార్నింగ్ ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.


కత్తితో వేటు..
అలా వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజులకే అమృత గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో అమృతను ఆసుపత్రికి తీసుకొచ్చారు. మిర్యాలగూడ పట్టణం.. సెప్టెంబర్ 14, 2018. మారుతీరావు పగ చల్లారే సమయం వచ్చింది. ఆసుపత్రికి వెళ్లిన ప్రణయ్, అమృత.. బయటికి వచ్చారు. అప్పటికే అక్కడ కత్తితో ఉన్న సుభాష్ శర్మ.. ప్రణయ్‌పై కత్తితో వెనుక నుంచి దాడి చేశాడు. ఒకటే వేటుకు కుప్ప కూలిపోయాడు. భయంతో అమృత పరుగులు తీసింది. కేకలు వేసింది. దీంతో సుభాష్ శర్మ పారిపోయాడు.


నిజాయతీగా దర్యాప్తు..
రక్తపుమడుగులో ప్రణయ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. మారుతీరావు పరువు కత్తికి ప్రణయ్ బలైపోయాడు. మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య.. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును అప్పటి జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులకు శిక్షపడేలా అన్ని ఆధారాలు సేకరించారు. శ్రీనివాసరావు అనే పోలీస్ అధికారి దర్యాప్తు బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నిజాయతీగా దర్యాప్తు చేసి.. ఆధారాలు కోర్టుకు సమర్పించారు.

ఒకరికి ఉరిశిక్ష..
ఈ కేసులో మారుతీరావుతో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ..2020లో మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు నల్గొండ న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. అమృత ప్రస్తుతం తన కొడుకుతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తుంది. ఆమె సోషల్ మీడియా ద్వారా తన జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది.

కనువిప్పు కలగాలి..
హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో.. ప్రణయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నల్గొండలో ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి. వారందరికీ.. ఈ తీర్పు కనువిప్పు కలగాలి. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం. వందమంది సాక్షులతో.. 1600 పేజీల చార్జిషీట్‌తో ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసును ఛేదించారు. ఈ కేసులో న్యాయవాదిగా వ్యవహరించిన దర్శనం నరసింహ ఎలాంటి ప్రలాభాలకు లోను కాకుండా.. న్యాయం పోరాటం చేశారు. న్యాయస్థానాలు, న్యాయవాదుల ద్వారా ఈ దేశంలో చట్టం అనేది ఉందని రుజువైంది’ అని ప్రణయ్ తండ్రి వ్యాఖ్యానించారు.

Also read

Related posts

Share via