SGSTV NEWS online
Hindu Temple HistorySpiritual

సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!



హిందూ సంప్రదాయంలో శక్తిపీఠాలకు విశిష్టమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలుగా భావించే ఈ పుణ్యక్షేత్రాలవి. దసరా నవరాత్రుల సందర్భంగా ఆయా శక్తిపీఠాలను సందర్శించడానికి భక్తులు తరలివెళ్తుంటారు. అక్కడ అనుభవం అయ్యే వింతలు, ఆధ్యాత్మిక తరంగాలు సైన్స్ కు సైతం అతీతంగా నిలుస్తోన్నాయి. యుగాలు గడుస్తోన్నప్పటికీ ఈ క్షేత్రాల చుట్టూ ఉన్న నమ్మకాలు, ఆచారాలు.. సైన్స్ కు అనేక ప్రశ్నలను మిగిలిస్తోన్నాయి.

ఎన్నో రహస్యాలు..
మానవ తర్కానికి అందని అనుభూతులను ప్రసాదించే అతిముఖ్యమైన శక్తి పీఠాల విశేషాలు, వాటి వెనుక ఉన్న ప్రత్యేకతలను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రతీ అంశాన్ని హేతుబద్ధంగా వివరించడానికి ప్రయత్నించినప్పటికీ.. అది నేటికీ సాధ్యపడట్లేదు. విశ్వాసం, ప్రాచీన చరిత్ర, సైన్స్ వివరించలేని ఆధ్యాత్మిక రహస్యాలు కలగలిసిన పవిత్ర ప్రదేశాలుగా నిలుస్తోన్నాయవి. సైన్స్ పరంగా లభించే ఆధారాల కంటే భక్తుల అపార నమ్మకమే ఈ క్షేత్రాల ఉనికికి ప్రధాన బలం.

కామాఖ్య ఆలయం..
అస్సాం గువాహతి నీలాచల్ పర్వతంపై వెలసిన కామాఖ్య దేవి ఆలయం అత్యంత ప్రాముఖ్యత కలిగిన శక్తిపీఠం. సతీదేవి యోని భాగం పడిన స్థలం ఇది. సృష్టికి, స్త్రీతత్వానికి నిదర్శనం ఈ ఆలయం. అన్ని ఆలయాల మాదిరిగా ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. గుహలో సహజ సిద్ధమైన రాతి రూపాన్ని జగన్మాతగా భక్తులు ఆరాధిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్ లో నిర్వహించే అంబుబాచి మేళా ఎంతో ప్రత్యేకమైనది.

ఇది ఎలా సాధ్యం..
ఈ సమయంలో అమ్మవారు రజస్వల అవుతుందని భావించి ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తారు. ఈ మూడు రోజులు కూడా ఆలయ సమీపంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పటికీ అంతుచిక్కట్లేదు. సైన్స్ ఓ చిక్కుముడిగానే మిగిలిపోయింది. ఆలయం తిరిగి తెరిచిన తర్వాత భక్తులకు అందజేసే ఎరుపు రంగు వస్త్రాన్ని పవిత్ర ప్రసాదంగా భావిస్తారు.

యుగాలుగా ఆరిపోకుండా
హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలాదేవి ఆలయం.. ఒకటి. అమ్మవారిని విగ్రహ రూపంలో కాకుండా నిరంతరం వెలిగే అఖండ జ్వాల రూపంలో ఆరాధిస్తారు. సతీదేవి నాలుక పడిన స్థలం ఇది. ఈ క్షేత్రంలో రాతి పగుళ్ల నుంచి జ్వాలలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. భూగర్భంలో ఉన్న సహజ వాయువుల వల్ల ఇది జరుగుతోందని శాస్త్రవేత్తలు వివరణలు ఇచ్చినప్పటికీ.. దానికి ఎటువంటి శాస్త్రీయత లేదు. ఆ వాయువు ఎక్కడి నుంచి వస్తోందనేది గుర్తించలేకపోయారు. యుగాలుగా ఆరిపోకుండా ఇవి నిరంతరం వెలగుతూనే ఉంటాయి. సైన్స్ కు అందని ఆధ్యాత్మిక తత్వం ఇది.

అక్కడ ప్రశాంత వదనం..
కోల్‌కతాలోని కాళీఘాట్ శక్తిపీఠం.. సతీదేవి కుడికాాలి వేళ్లు పడిన పవిత్ర స్థలంగా ప్రాచుర్యం పొందింది. సాధారణంగా ఉగ్రరూపంలో కాళికాదేవి ఈ ఆలయంలో ప్రశాంత రూపంలో దర్శనం ఇస్తుంది. అత్యంత శక్తిమంతంగా కనిపిస్తుంది. విశాలమైన నేత్రాలు, ప్రత్యేకమైన రూపురేఖలతో ఉండే ఈ విగ్రహం భక్తులలో అలౌకిక భక్తిభావాన్ని నింపుతుంది

ఇలాంటి క్షేత్రాలు భక్తిభావంతో పాటు సమాజంలో నమ్మకానికి పెద్ద పీట వేస్తాయి. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాలు, నమ్మకాలు మన జీవన విధానాలుగా మారాయి. సైన్స్ కు అతీతంగా ఉన్న ఈ ఆధ్యాత్మిక రహస్యాలు భక్తజనాన్ని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. మోక్షప్రాప్తి కోసం అన్వేషించే వారికి ఈ ప్రదేశాలు కేంద్రబిందువులు. కాలాలు మారుతున్నా, ఆధునిక సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఈ క్షేత్రాల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం తగ్గలేదు.



Related posts