April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

వైసీపీ కార్యకర్తను దగ్గరుండి అరెస్ట్ చేయించిన అంబటి రాంబాబు.. మాజీ మంత్రి ప్లాన్ ఇదే..! వీడియో



Ambati Rambabu House Ysrcp Man Arrest: మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్సార్‌సీపీ కార్యకర్తను దగ్గరుండి పోలీసులకు అప్పగించారు. పల్నాడు జిల్లా నకరికల్లులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. తానే స్వయంగా ఆయన్ను పోలీసులకు అప్పగించానని తెలిపారు. మంగళవారం రోజే తాను రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో ఉంటాడడని చెప్పానని.. ఇవాళ పోలీసులు వచ్చి కేసుకు సంబంధించిన వివరాలు చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నారు. తాము ఈ అరెస్ట్‌పై న్యాయ పోరాటం చేస్తామన్నారు అంబటి.



వైఎస్సార్‌సీపీ కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజంగానే. ఆయనే దగ్గరుండి పోలీసులకు అప్పగించారు. అసలు విషయానికి వస్తే.. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. ఈ మేరకు ఏలూరు జిల్లా నూజివీడులో పోలీసులు కేసు నమోదు చేసి రాజశేఖర్‌ కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారు.




ఈ క్రమంలో రాజశేఖర్‌రెడ్డి కోసం నకరికల్లులోని అతడి ఇంటికి వెళ్లారు.. అతడు దొరకలేదు. ఈ క్రమంలో మంగళవారం అంబటి రాంబాబు రాజశేఖర్‌ తమ ఇంట్లోనే ఉన్నాడని.. పోలీసులు అరెస్ట్ చేసుకోవచ్చని చెప్పారు. ఆయనపై నమోదైన కేసు ఏంటో చెప్పి తీసుకెళ్లొచ్చన్నారు. వెంటనే రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు.. ఇవాళ గుంటూరులో అంబటి ఇంట్లో ఉన్న రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంబటి రాంబాబు రాజశేఖర్ తన ఇంట్లోనే ఉన్నాడని చెప్పడంతో నూజివీడు పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.



ఈ అరెస్ట్‌పై అంబటి రాంబాబు స్పందించారు.. తానే స్వయంగా రాజశేఖర్‌రెడ్డిని పోలీసులకు అప్పగించానని చెప్పారు. ఆయన కోసం నాలుగు రోజులుగా పోలీసులు వెతుకుతున్నారని.. చట్ట ప్రకారం ఏ స్టేషన్లో కేసు నమోదు చేశారో చూపించి తీసుకెళ్లమని తానే చెప్పానన్నారు. బుధవారం ఉదయం 10:30 నిమిషాలకు తన ఆఫీసుకి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని క్లారిటీ ఇచ్చారు.
పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఈ నెల 9వ తేదీన టీడీపీకి చెందిన సీతారామాంజనేయులు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో రాజశేఖర్ రెడ్డిపై కేసు పెట్టారన్నారు. అదే వైఎస్సార్‌సీపీ నేతలపై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవడం లేదన్నారు అంబటి. తనపై తన కుటుంబ సభ్యుల పై అసభ్య పద జాలంతో కొందరు పోస్ట్‌లు పెట్టారని.. టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు.
 

వైఎస్సార్‌సీపీ షోషల్‌మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు సరికాదని.. గతేడాది ఫిర్యాదులపై ఇప్పుడు అరెస్టులు చేయడం దారుణమన్నారు రాంబాబు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలపై సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన వారు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశామన్నారు. తాము చేసిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని..తమపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న మంత్రి నారా లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలన్నారు మాజీ మంత్రి.

Also read

Related posts

Share via