February 23, 2025
SGSTV NEWS
Crime

POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు


పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో మరో ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

POCSO case :  పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. రాష్ర్ట వ్యాప్తంగా విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారికి దేహశుద్ధి చేస్తున్నా చాలామంది తమ తీరును మార్చుకోవడం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో మరో ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. స్కూల్‌లో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు దేవయ్యపై పోక్సో కేసు నమోదు కావడం ఉపాధ్యాయుల్లో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దేవయ్య బయాలజీ టీచర్‌. బయాలజీ ప్రాక్టికల్స్‌ పేరుతో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినీలు ఆరోపిస్తున్నారు. దేవయ్య ప్రాక్టికల్స్‌ పేరుతో కొంతమంది విద్యార్థులను సైన్స్‌ ల్యాబ్‌లోకి తీసుకెళ్లి వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నప్పటికీ భయంతో విద్యార్థినీలు ఎవరికీ చెప్పుకోలేదు. దీంతో దేవయ్య వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇక భరించలేక విద్యార్థినులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయమై కొందరు తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. విషయం తెలిసిన దేవయ్య స్కూలుకు రాలేదు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న ప్రధానోపాధ్యాయుడి సూచనతో వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

కాగా ప్రధానోపాధ్యాయుడు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చారు. మరోవైపు, శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకొని మరోసారి ఆందోళనకు దిగారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను నిలదీశారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్‌ సీఐ విద్యాసాగర్‌ పాఠశాలకు చేరుకొని ప్రాథమిక విచారణ చేశారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ దుర్గా.. విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి సమాచారాన్ని సేకరించారు. దీంతో దేవయ్య లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమే అని తేలడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ విద్యాసాగర్‌ తెలిపారు. మరోవైపు దేవయ్య విషయంపై ఫిర్యాదు అందడంతో ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

Also read

Related posts

Share via