SGSTV NEWS online
CrimeTelangana

Osmania University: ఓయూలో ఉద్రిక్తత.. విద్యార్థిని తల్లిని హాస్టల్ నుండి గెంటేసిన సిబ్బంది!


Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ (OU) క్యాంపస్‌లో హాస్టల్ సిబ్బంది కర్కషత్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన బిడ్డను చూడటానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా.. సిబ్బంది అత్యంత అమానవీయంగా హాస్టల్ నుండి బయటకు పంపడంతో విద్యార్థినిలు రాత్రంతా రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

అసలేం జరిగిందంటే!: విద్యార్థిని తల్లి తన కుమార్తెను చూసేందుకు మారుమూల గ్రామం నుండి హాస్టల్‌కు వచ్చారు. బిడ్డ యోగక్షేమాలు అడిగి.. ఆమెకు కావాల్సిన వస్తులు కొనిచ్చేసరికి
రాత్రి అయ్యింది. దీంతో ఆ సమయంలో వెళ్లడం ఇబ్బందిగా భావించి సదరు మహిళ ఆ రాత్రికి హాస్టల్‌లోనే ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని సిబ్బందిని కోరారు. అయితే హాస్టల్ యాజమాన్యం ఏమాత్రం కనికరం చూపలేదు. నిబంధనల పేరుతో మొండిగా ప్రవర్తిస్తూ “ఇక్కడ ఉండటానికి వీల్లేదు.. ఇప్పుడు వెళ్లిపోవాల్సిందే” అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించి బయటకు పంపే ప్రయత్నం చేశారు. రాత్రి వేళ ఒంటరిగా తన తల్లి ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని ప్రశ్నించింది. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థిని తల్లిని హాస్టల్ నుండి గెంటేశారు.



విద్యార్థినుల ఆందోళన: బిడ్డ కోసం వచ్చిన తల్లికి జరిగిన అవమానం గురించి తెలియడంతో హాస్టల్ విద్యార్థినులంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. “మా తల్లిదండ్రులకు గౌరవం లేని చోట మేం ఎలా ఉండాలి?” అంటూ విద్యార్థినిలు నిలదీశారు. విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్ నిబంధనల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఆపాలని కోరారు.

ఉద్రిక్తంగా మారిన ఉస్మానియా: బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ నిరసన గురువారం ఉదయం వరకు కొనసాగింది. ఇతర హాస్టల్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు సైతం మద్దతు తెలపడంతో ఉస్మానియా క్యాంపస్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వర్సిటీ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Also read

Related posts