అధ్యయనం కోసం 6 రాష్ట్రాలకు 4 కమిటీలు
గత ప్రభుత్వ అక్రమాలపై సిఐడి దర్యాప్తు
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు ఒకటి నుంచి నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలను తీసిందని, తమ ప్రభుత్వం వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని తెలుగుదేశం కూటమి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులతో కసరత్తు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ఇప్పటికే సిఐడిని ఆదేశించామని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేశారు. ఏవైనా ఆధారాలు దొరికితే సిఐడికి నివేదించాలని ఆదేశించారు. కొత్త విధానం రూపకల్పనకు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అధికారులతో కూడిన నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ముగ్గురు చొప్పున సీనియర్ అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక-తెలంగాణ, తమిళనాడు-కేరళ రాష్ట్రాలకు ఈ నాలుగు కమిటీలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపుల నిర్వహణ, బార్ల అనుమతులు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ తదితర అంశాలపై ఈ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైనా పరిశీలన చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై నాలుగు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. ఈ నెల 12లోగా అధ్యయన నివేదికలు సమర్పించాలని కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది
Also read:
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం