SGSTV NEWS
Andhra PradeshPolitical

Nellore Politics: అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్?



Nellore Politics: అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రులు అడ్డంగా బుక్ అయ్యారు.. రుస్తుం మైన్స్ లో వందల కోట్ల క్వార్ట్జ్ దోపిడీలో కాకాణి గోవర్ధన్ రెడ్డి 23 అనిల్ కుమార్ యాదవ్ పై వచ్చి ఆరోపణలను విచారణాధికారులు నిర్ధారించారు మాజీ మంత్రుల ముఖ్యఅనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాగ్మూలంతో వారు పూర్తిగా ఇరుక్కుపోయారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి ఊచలు లెక్కపెడుతున్నారు. ఇక బిరదవోలు శ్రీకాంత్రెడ్డి స్టేట్మెంట్ లో అనిల్ యాదవ్ అరెస్టు కూడా ఖాయమంటున్నారు. అనిల్ ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్ లాంఛనం పూర్తి చేస్తారన్న టాక్ నడుస్తోంది.

అనిల్ కుమార్యాదవ్ మెడకు క్వార్జ్ అక్రమ రవాణా కేసు ఉచ్చు

క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మెడకు ఉచ్చు బిగుస్తోందా..! అంటే అవుననే సమాధానం చెప్పక తప్పని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక క్వార్జ్ అక్రమ తరలింపు పై కొనసాగుతున్న విచారణలో తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న బీరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మాజీ మంత్రిని ఈ కేసులోకి లాగింది. ఈ కేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరుని కూడా చేర్చినట్లు చర్చ జరుగుతుంది. త్వరలో ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

క్వార్జ్ ఖనిజాన్ని అనుమతుల్లేకుండా తవ్వి, విదేశాలకు ఎగుమతి

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అనిల్కుమార్యాదవ్, కాకాణి గోవర్ధన్రెడ్డిలు అధికారమే అండగా చెలరేగిపోయారన్న ఆరోపణలున్నాయి. సహజవనరుల్ని అందినకాడికి దోచేశారని సొంత పార్టీ వారే అంటున్నారు. రూ.వందల కోట్ట విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అనుమతుల్లేకుండా తవ్వేసి, విదేశాలకు ఎగుమతి చేసిన కేసులో వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. క్వార్ట్జ్ తవ్వకాల్లో నిబంధనలు విరుద్దంగా పేలుడు పదార్ధాలు వినియోగించడం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడ్డారని మాజీ మంత్రులపై తీవ్ర ఆరోపణలున్నాయి.

ఇతర ఎగుమతిదారుల్ని బెదిరించి అనిల్ వర్గం వసూళ్లు

అనిల్ యాదవ్ అక్రమ రవాణా, ఎగుమతులతోపాటు, ఇతర ఎగుమతిదారుల్ని బెదిరించి టన్నుకు రూ.7 వేల నుంచి 10 వేల వరకు మామూళ్లు వసూలు చేయించారంట. కాకాణి, అనిల్ యాదవ్ల వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రధారి, వారితో కలిసి ఈ దందాలో పాలుపంచుకున్న ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ మొత్తం కుట్రను బయటపెట్టాడంట. పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలోని రుస్తుం మైన్స్లో అక్రమ తవ్వకాలపై గనుల శాఖ అధికారి ఇఛ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 16న కేసు నమోదైంది.

చెన్నై, బెంగళూరుల్లో రాయి గ్రేడ్ను బట్టి టన్ను ధర నిర్థారణ

ఆ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాదొడ్డి, ఆ పార్టీ నేతలు, మరికొందర్ని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఏ4గా ఉన్న కాకాణి సహా ఇప్పటి వరకు ఆరుగురు అరెస్ట్ అయ్యారు. ఈ అక్రమ దందాలో అనిల్కుమార్కు కీలక పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయననూ త్వరలో నిందితుడిగా చేర్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పలు మండలాల్లో అరుదుగా లభించే ఖనిజం క్వార్జ్. మైన్ ల నుంచి వెలికి తీసిన ఈ తెల్లరాయికి ఇతర దేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు కేవలం మైన్ యజమానులు మాత్రమే ఈ వ్యాపారం చేసేవారు. భారీ యంత్రాలతో ఆ రాయిని బయటకు తీసి చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు తరలించేవారు. రాయి గ్రేడ్ ను బట్టి టన్ను ధర నిర్ధారించేవారు. ఇలాంటి మైనింగ్ పై రాజకీయ నేతలు కూడా కన్నేశారు. వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు మైనింగ్ వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు అప్పట్లో భారీ ఎత్తున ప్రచారం సాగింది.

పొదలకూరు సైదాపురం, గుడూరు మండలాల్లో క్వార్జ్ ఖనిజం

అయితే ఇందుకు ఎక్కడ ప్రత్యక్ష ఆధారాలు లేకపోవడంతో వారి పాత్ర ఉండి ఉండవచ్చన్న అనుమానాలు మాత్రం కొనసాగాయి.. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేపట్టిన విచారణలో వారి పాత్ర ఉందని తేటతెల్లమైంది. దీంతో కేసు నమోదు చేసి 12 మందిని నిందితులుగా చేర్చారు.

నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, సైదాపురం, గూడూరు మండలాల్లో క్వార్ట్జ్ ఖనిజం విస్తారంగా లభిస్తుంది. దీంతో వైసీపీ నేతలు అప్పట్లో చెలరేగిపోయారు. భారీగా తవ్వకాలు జరిపి జేబులు నింపుకున్నారు. అధికారంలో ఉన్నది వారి ప్రభుత్వమే కావడంతో అధికారులకు మామూల్లు ముట్ట చెప్పి కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు.

పొదలకూరుపై దృష్టి పెట్టడంతో కాకాణితో విభేదాలు

ఆ క్రమంలో సైదాపురం, గూడూరు మండలాల్లో అనేక చోట్ల క్వార్జ్ ఖనిజాన్ని బయటకు తీసి ఇతర రాష్ట్రాలకు తరలించే వ్యాపారంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే పొదలకూరు మండలం పై కూడా దృష్టి పెట్టడంతో అప్పట్లో మాజీ మంత్రిలు కాకాణి గోవర్ధన్ రెడ్డి కి, అనిల్ కుమార్ యాదవ్ కి మనస్పర్ధలు వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసు కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదు అవ్వడం వారి మధ్య మనస్పర్ధలకు కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

బయటపడుతున్న రుస్తుం మైన్స్ అక్రమాలు

పొదలకూరు మండలం వరదాపురం లో మూతపడిన రుస్తుం మైన్స్ లో జరిగిన అక్రమ తవ్వకాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇక్కడ నుంచి లక్షల టన్నుల ఖనిజం దేశ సరిహద్దులు దాటి చైనాకు చేరింది. ఈ వ్యవహారం మొత్తంలో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉన్నట్లు 12వ నిందితుడిగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వాంగ్మూలం ప్రకారం ఇరువురి పాత్ర అక్రమ తవ్వకాల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం లేకపోలేదంటున్నారు.

ఒకే టైమ్ లో శ్రీకాంత్రెడ్డి, కాకాణి కోర్టు ముందు హాజరు

తాజాగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని గూడూరు కోర్టులో హాజరు పరిచారు. అదే సమయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డినీ ఇదే కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా అనేక విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో క్వార్జ్ ఖనిజాన్ని బయటకు తీసి తరలించే విషయంలో మొత్తం పర్యవేక్షణ అంతా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి చూశారట. ఆ వచ్చిన మొత్తాన్ని పలు ప్రాంతాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా గూడూరు సమీపంలో 100 ఎకరాల వెంచర్, నాయుడుపేట సమీపంలో 50 ఎకరాల వెంచర్ వేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

ఒకే కేసులో ఇద్దరు మాజీ మంత్రులకు బిగుసుకున్న ఉచ్చు

శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని న్యాయ నిపుణులు అంటున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఎక్కడ కేసు నమోదు చేస్తారు కూడా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. పొదలకూరు మండలం వరదాపురంలో ఉన్న రుస్తుమ్ మైన్స్ లో ఈ దోపిడీ జరిగింది కనుక అక్కడ కేసు నమోదు అవుతుందా. గూడూరు ప్రాంతంలోనూ అక్రమ తవ్వకాలు తరలింపు జరిగాయి కనుక ఈ ప్రాంతంలో కేసు నమోదు చేస్తారా? అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా అక్రమ తవ్వకాలు తరలింపుల విషయంలో ఒకే జిల్లాకు, ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులను కేసు వెంటాడుతోంది. ఇలా ఓ కేసులో ఇద్దరు మాజీ మంత్రులు పాత్ర ఉండటం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది.

Also read

Related posts

Share this