SGSTV NEWS online
Andhra PradeshCrime

వ్యక్తి దారుణ హత్య

నెల్లూరు: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన  ఘటన నెల్లూరులో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో పగలంతా భిక్షాటన చేసుకుంటూ రాత్రివేళల్లో రంగనాయకులపేట రైల్వేగేట్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ కార్యాలయం పక్కనే చెట్ల కింద నిద్రించేవాడు. ఆదివారం ఆయన దారుణ హత్యకు గురై ఉండటాన్ని స్థానికులు గమనించి సంతపేట పోలీసులకు, వీఆర్వో సందానీబాషాకు సమాచారం అందించారు.

ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు, ఎస్సై బాలకృష్ణలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సదరు వ్యక్తి నిద్రలో ఉండగానే దుండగులు కర్రతో తలపై తీవ్రంగా కొట్టారని, దీంతో మెదడు బయటికి వచ్చి చనిపోయినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు.

ఎవరు చేశారో..

ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల విచారించారు. విచారణలో మృతుడు అదే ప్రాంతంలో భిక్షాటన చేసే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడని, తరచూ వారి మధ్య గొడవలు జరుగుతుండేవని తేలింది. శనివారం రాత్రి వారు కలిసి ఉన్నారని స్థానికులు తెలిపారు. ఆదివారం కనిపించకపోవడంతో ఆమే ఈ ఘాతుకానికి పాల్పడిందా? భయంతో పారిపోయిందా? ఇంకెవరైనా హత్య చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతుండటంతో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read

Related posts