సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం రక్తం చిందించింది. గొడ్డలతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఈ దాడుల్లో ఇద్దరూ మృతి చెందగా.. ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఎస్సైకి సైతం తీవ్ర గాయాలయ్యాయి.
మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో భుక్యా సైదా, వెంకటేశ్వర్లు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ఉదయం దాని చెట్టు కొమ్మలు నరికేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నించాడు. అది గమనించిన సైదా అడ్డు చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సైదా కొడుకు రాము.. అదే గొడ్డలితో వెంకటేశ్వర్లును నరికాడు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.
దీంతో కోపోద్రిక్తులైన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు సైదా, సైదా కొడుకు రాముపై దాడికి యత్నించాడు. అది గమనించిన మరికొందరు స్థానికులు సైదా తరఫున కొట్లాటకు వచ్చారు. ఇరు వర్గాల ఘర్షణలో కొందరికి గాయాలు కాగా.. అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఇదే అదనుగా తన కుమారుడిని ఘటనా స్థలం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు సైదా. అయితే..
పట్టరాని కోపంతో రాము తన తండ్రి సైదాపై గొడ్డలితో దాడి చేశాడు. ఆపై భయంతో ఓ ఇంట్లో దూరి దాక్కున్నాడు. సైదాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు.. రామును అప్పగిస్తేనే ముందుకు కదలిస్తామని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

ఈలోపు.. రామును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్సై నవీన్‌కు గాయాలయ్యాయి. సైదాను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆలస్యం కావడంతో మార్గం మధ్యలోనే మరణించాడు. ఎస్సై నవీన్ సహా గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వెంకటేశ్వర్లు, సైదా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ డబుల్ మర్డర్‌తో ఆ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్‌లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





