November 21, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 6 వ అధ్యాయం – పురాణ
ప్రారంభం – 6

పురాణ ప్రారంభం – 6*

*”నీ ప్రధాన కర్తవ్యం ప్రజోత్పత్తి ! నేను సాగించబోయే నిరంతర సృజనలో అందగత్తెలు ఆవిర్భవిస్తారు. నచ్చిన వనితను సహధర్మచారిణిగా స్వీకరించి దాంపత్య ధర్మం నిర్వర్తించి, సమృద్ధిగా సంతానాన్ని ఉత్పత్తి చేసి, నీ తండ్రి అయిన నా ఋణం తీర్చుకో !”* “నారాయణ ! నారాయణ !” నారదుడు నవ్వుతూ అన్నాడు. “నారాయణ నామగానమే నా పత్ని. దాని మూలంగా పొందే ఆనందమే నా సంతతి.”*

“కుమారా !” బ్రహ్మ ఆశ్చర్యంగా అన్నాడు.

*”జనకా! నా నారద నామధేయంలోని అర్థం సెలవిస్తారా ?” నారదుడు వినయంగా అడిగాడు.

“నీకు నేను ప్రసాదించింది ఎన్నికచేసిన పేరు, కుమారా ! ‘పరమాత్మ విషయకమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు’ అనే అర్థం స్ఫురించే నామధేయం అది !”

“ధన్యోస్మి !” నారదుడు వినయంగా అన్నాడు. “జ్ఞానదాత అని నన్ను పేర్కొన్నారు కదా ! అది సార్ధక నామధేయం కావాలి కదా ! ఈ జ్ఞానదాతకు సంతానం మోత ఎందుకు ?” బ్రహ్మ తీక్షణంగా చూశాడు. “ఇది అవిధేయత ! జన్మదాత అయిన నా ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావు. నీ ప్రవర్తన శిక్షార్హమైన అపరాధం తెలుసా ?” “నారాయణ ! తండ్రి శిక్ష తనయుడికి రక్ష! అనుగ్రహించండి !” నారదుడు చిరునవ్వు నవ్వాడు.

ఆగ్రహం రజోగుణ స్పర్శతో బ్రహ్మదేవుడి ముఖ కమలాన్ని ఎర్రగా చేసింది. “అవిధేయతకు శిక్ష అనుభవించు ! నిత్య బ్రహ్మచారిగా, నిరంతర లోక సంచారిగా తపించు !”

“ధన్యోస్మి ! నా నిత్య బ్రహ్మచర్యానికీ నిరంతర లోక సంచారానికీ నారాయణ నామ సంకీర్తనను జత చేసి, తదేక ధ్యానంతో తపిస్తాను: సంకీర్తనా తపస్సు సాగిస్తాను !”

“నీకు ఒక చోట నిలకడగా కాలు నిలువదు. ఇది యీ విధి విధింపు !” బ్రహ్మ కంఠంలో ఆవేశం ధ్వనించింది..

“మీ ఆగ్రహం నాకు అనుగ్రహం. ధన్యోస్మి ! ఇప్పుడే నా సంచారం ప్రారంభిస్తాను. సెలవు !” నారదుడు చిరునవ్వుతో నమస్కరించి వెనుదిరిగి వెళ్తున్నాడు.

బ్రహ్మదేవుడు అతన్నే చూస్తున్నాడు. ఆయన ఆవేశం మందహాసంగా మారింది. విష్ణు సంకల్పం ! ఆ విశిష్ట సంకల్పాన్ని తన సంకల్పం వికల్పం చేయలేదు ! ఆయన నారదుడి ఆకారాన్నే చూస్తూ *”నారాయణార్పణం !”” అన్నాడు తృప్తిగా.

సృష్టికర్త తన మానసాన్ని తన సహజ కార్యక్రమం వైపు మళ్ళిస్తూ, కళ్ళు మూసుకున్నాడు.

ఆయన సమ్ముఖంలో ఒక పురుషుడూ, ఒక స్త్రీ ఆవిర్భవించారు. ఇద్దరూ పాల నురగలాంటి తెల్లటి వస్త్రాలు ధరించి వున్నారు. బ్రహ్మ కళ్ళు తెరిచి ఇద్దర్నీ వాత్సల్యంతో చూశాడు.

“కుమారా ! నేను సృష్టికర్త బ్రహ్మను. నువ్వు నా సంకల్ప సంజాతుడవు ! నా మానస పుత్రుడవు…” బ్రహ్మ పురుషుడిని చూస్తూ అన్నాడు.

“జనకులకు నమస్కారం !” ఆ పురుషుడు చేతులు జోడిస్తూ అన్నాడు.

“స్వయంభువుడైన నా సంకల్పంలో – నా అంశతో నువ్వు ఆవిర్భవించావు.. స్వయంభువ సుతుడైన కారణంగా నువ్వు స్వాయంభువుడవు ! ‘మనువు’ అనే బిరుదాన్ని ప్రసాదిస్తున్నాను. మనువులలో మొదటివాడివైన నువ్వు ‘ఆదిమనువు’ అని కూడా వ్యవహరించబడతావు…” అంటూ బ్రహ్మ స్త్రీ మూర్తి వైపు చూపుల్ని ప్రసరించాడు.

“తన్వీ ! నీ నామధేయం ‘శతరూప’. చక్కటి సౌష్ఠవంతో జవ్వనిగా ఆవిర్భవించిన నీకు ‘యువ’ అనీ, ‘యువాదేవి’ అనీ సార్ధక నామధేయాలు ప్రచారంలోకి వస్తాయి !”

“ధన్యురాలను !” శతరూప నమస్కరిస్తూ అంది.

“స్వాయంభువా ! యువతి శతరూపను నీ భార్యగా స్వీకరించు. మీ దాంపత్య ఫలాలుగా భూలోక వాసం చేసే నరజాతి ఆవిర్భవించి, వృద్ధి చెందుతుంది ! ‘మనువు’ అని సంతతి అయిన కారణంగా ఆ నరజాతి ‘మానవ’ జాతిగా వ్యవహరింపబడుతుంది. ఆ మానవజాతికి ‘బాల్యము’, ‘కౌమారము’, ‘యవ్వనము’, ‘వృద్ధాప్యము’ అనే నాలుగు దశలుంటాయి. మృత్యువుతో మానవుని జీవితం పరిసమాప్తమవుతూ వుంటుంది. ఆ కారణంగా మానవులు ‘మర్త్యులు’ అనీ, వాళ్ళు నివసించే భూలోకం ‘మర్త్యలోకం’ అనీ వ్యవహరింప బడతాయి…” బ్రహ్మ ఆగి. ఇరువుర్నీ కలియజూశాడు.

“మీ ఇద్దరి సంతతితో భూలోకం నిండి పోవాలి !”.

మనువూ, శతరూపా నమస్కరించారు.

“భార్యాభర్తలుగా మీ జీవితం గురించీ, సంతానలాభం గురించీ, జీవన ధర్మాల గురించి మీకు చక్కని అవగాహన అవసరం. ఆ జీవనవేదం మీకు ధ్యానగోచరం కావాలి. అందువల్ల ప్రశాంత వాతావరణంలో, మనసుకు నచ్చిన ప్రదేశంలో ఇద్దరూ ‘తపోసాధన’ సాగించండి. ప్రస్తుతానికి మీ కర్తవ్యం అదే !” అన్నాడు బ్రహ్మ, తన ఉపదేశాన్ని ముగిస్తూ.

“జనకా… మీరు సెలవిచ్చిన భూలోకం” స్వాయంభువ మనువు ఏదో అడిగే ప్రయత్నంలో అన్నాడు.

బ్రహ్మ చెయ్యెత్తి వారించాడు.

“కుమారా ! ముందుగా మానవజాతిని వృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానం నీకు సమకూరాలి ! నీ సంతతిగా పుట్టే మానవుల నిత్య జీవనవికాసం కోసం – ఆ జాతి మూల పురుషుడయ్యే నువ్వు – – జీవన సూత్రాలను నిర్దేశించవలసి వుంటుంది. దానికి అవసరమైన నేపధ్యం ఇప్పుడు నువ్వు చేసే సాధన ద్వారా లభిస్తుంది. భూలోకం గురించిన అంశం గురించి సకాలంలో నువ్వు నా సన్నిధికి వస్తావు ! ఇప్పుడు నీ కర్తవ్యం భూలోక విచారం. కాదు : తపస్సు ! వెళ్ళు ! శతరూపతో కలిసి తపస్సు సాగించు !”

శ్రీ గురు దత్తా

సేకరణ.. ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via