July 1, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహా పురాణం – 1 వ అధ్యాయం – పురాణ ప్రారంభం -1

పురాణ ప్రారంభం -1

నిర్వికల్పాలలో శ్లోకం శ్రావ్యంగా ధ్వనించింది ; భక్తి ప్రతిధ్వనించింది. చేతులెత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాడాయన. శిష్యులు విమలానందుడూ , శివానందుడు, సదానందుడు, చిదానందుడు గురువుగారిని అనుసరిస్తూ సూర్యుడికి నమస్కారాలు అర్పించారు.

పడమటి ఆకాశంలో గుండ్రటి సూర్యుడు దిశా సుందరి నుదురు మీద సింధూర తిలకంలా మెరిసిపోతున్నాడు.

*”ఒక్క గ్రహరాజు చరిత్ర మాత్రమే ఏమిటి, సదానందా…. గురువుగారి అమృతవాణి ద్వారా నవగ్రహాల కథ అంతా విందాం !”* శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.

నిర్వికల్పానంద గట్టుమీద ఆగి శిష్యుల్ని కలయజూశాడు. “మన శివానందుడి ఆలోచన బాగుంది. నవగ్రహాల చరిత్రలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని వుంటాయి. అందుచేత అందరి గురించీ తెలుసుకుందాం. పదండి. ఇవాళే నవగ్రహ పురాణం ప్రారంభించుదాం !”*

ఆశ్రమంలో వాతావరణం ప్రశాంతంగా వుంది. పక్షుల కిలకిలారావాల్నీ, పువ్వుల సువాసనల్నీ మోసుకువస్తూ పరవశిస్తోంది పిల్లగాలి.

నిర్వికల్పానంద అరుగు మీద కూర్చున్నాడు. శిష్యులు ఆయన ముందు వినయంగా కూర్చున్నారు. నిర్వికల్పానంద మొహం మీద చిరునవ్వు మెరిసింది.

*”నవగ్రహాల చరిత్ర వినాలని మీరు ముచ్చట పడటం చాలా మంచిది. ఒకరి చేత ‘చెప్పించుకుని వినాలి’ అనుకోవడమే గొప్ప విషయం. ఎందుకంటే – ‘శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం’ అనేవి భక్తి యోగంలో తొమ్మిది విధానాలు. ఈ తొమ్మిదింటినీ కలిపి – ‘నవ విధ భక్తి’ అన్నారు పెద్దలు. ఈ తొమ్మిదింటిలో ‘శ్రవణం’ అనేది ప్రథమ విధానం మాత్రమే కాదు. ప్రధాన విధానం కూడా ! భక్తి ప్రక్రియలలో శ్రవణానిదే పెద్దపీట !”*

నవగ్రహ పురాణం అనేది ఒక మహత్తర, బృహత్తర చరిత్ర. ఆ పురాణ శ్రవణం నిర్విఘ్నంగా, నిరంతరాయంగా సాగిపోవాలి. నిర్విఘ్నంగా చేసే నవగ్రహ పురాణ ప్రవచనం, శ్రవణం – నవగ్రహాల ఆరాధనతో సమానం అన్నారు విజ్ఞులు.””

*”అయితే, గురువుగారూ, నవగ్రహ పురాణ శ్రవణం ప్రారంభించి, పూర్తయ్యేదాకా మనం సంచారం వెళ్ళమన్న మాట” విమలానందుడు ప్రశ్నించాడు.

*”ఔను. సంకల్పించాం కదా ! నవగ్రహ పురాణ శ్రవణాన్ని శుభంగా ప్రారంభించి, శుభంగా పరిసమాప్తం చేద్దాం” నిర్వికల్పానంద అన్నాడు.

*”గురువుగారూ ! ఒక సందేహం….” సదానందుడు అన్నాడు.*

*”ఈ సదానందుడికి సదా సందేహాలే !” చిదానందుడు నవ్వుతూ అన్నాడు. శిష్యులు ఆ నవ్వుతో శృతి కలిపారు.*

*”సందేహం అనేది మానసికమైన అన్వేషణ. సందేహాలకు సమాధానాలు పొందటం కూడా సాధనలో ఒక భాగమే! ప్రశ్నోపనిషత్తు విన్నారు కదా !”* నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. *”నీ సందేహమేమిటో అడుగు. సదానందా !”*

*”ఏం లేదు గురువుగారూ….. నవగ్రహాలు అనగానే మనిషి భయభక్తులతో పూజలు చేస్తాడు. ఎందుకంటారు?”*

*”మంచిప్రశ్న ! నిజమే ! మానవులు భయాన్నీ, భక్తినీ రంగరించి ఆరాధించేది ఒక్క నవగ్రహ దేవతలను మాత్రమే ! నవగ్రహాల ప్రభావమూ, ప్రతాపమూ అంతగొప్పవి !”* నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు. *”మానవుడు మాతృగర్భంలో పడిన క్షణం నుండి, కాలగర్భంలో కలిసిపోయేదాకా – అతని జీవితం పూర్తిగా నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి  వుంటుంది.”




శ్రీ గురు దత్త
సేకరణ :–ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via