తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి లోక కంటకుడైనా హిరణ్యకశిపుడిని శిక్షించడానికి శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారం నరసింహ అవతారం. దశావతారముల్లో నాల్గో అవతారం. వైశాఖ మాసం పద్నాలుగో రోజున నరసింహ స్వామి అవతరించాడు. ఈ రోజుని నరసింహ జయంతిగా హిందువులు భక్తితో జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఉగ్ర రూపం అయిన నరసింహ స్వామి అనుగ్రహం కోసం ఈ రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయవద్దు.
విష్ణువు అవతారాల్లో ఉగ్ర రూపం నరసింహ స్వామి. సగం నరుడు.. సంగం సింహం కలిపిన ఈ మహిమాన్వితమైన అవతారం దాల్చిన రోజుని నరసింహ స్వామి జన్మదినోత్సవంగా ప్రతి సంవత్సరం భక్తితో జరుపుకుంటారు . ఈ పండుగ చెడుపై మంచి విజయానికి ప్రతీక. ఈ రోజున నరసింహుడు తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్యకశిపు అనే రాక్షసుడిని చంపాడు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి.. పూజలు చేయడం.. ప్రత్యేక నియమాలను పాటించడం ద్వారా నరసింహ స్వామి ఆశీర్వాదం పొందుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం నరసింహ జయంతి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం అవసరం. ఈ నియమాలను ఉల్లంఘిస్తే నరసింహ స్వామి కోపంగా ఉంటాడని ..అటువంటి వారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారని నమ్ముతారు.
నరసింహ చతుర్దశి ఎప్పుడు? పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిధి మే 10న సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిది మే 11న రాత్రి 9:19 గంటలకు ముగుస్తుంది. కనుక ఈ సంవత్సరం నరసింహ జయంతి మే 11న జరుపుకుంటారు.
నరసింహ జయంతి రోజున ఏ తప్పులు చేయకూడదు అంటే ఈ పవిత్ర రోజున మనస్సును ప్రశాంతంగా, సానుకూలంగా ఉంచుకోవాలి. ఎవరితోనైనా కోపంగా మాట్లాడడం లేదా ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండటం అశుభంగా పరిగణించబడుతుంది. నరసింహ స్వామి ప్రకృతి రీత్యా ఉగ్ర స్వభావం కావచ్చు. కానీ స్వామికి శాంతి, భక్తి తత్వాన్ని ప్రేమిస్తాడు.
తామసిక ఆహారానికి దూరంగా నరసింహ జయంతి రోజున పూర్తిగా సాత్విక ఆహారం తినాలి. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి తామసిక పదార్థాలను తినకుండా ఉండాలి. ఈ రోజు దేవునికి అంకితం చేయబడింది. మానసిక శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం చాలా అవసరం.
ఎవరినీ అవమానించవద్దు: ఈ రోజున ఎవరినీ, ముఖ్యంగా వృద్ధులను లేదా బలహీనులను అవమానించవద్దు. నరసింహ స్వామీ సకల జీవుల్లోనూ ఉన్నాడు. ఎవరినైనా అగౌరవపరిస్తే, అతనికి కోపం కలుగుతుంది.
నలుపు లేదా నీలం రంగు దుస్తులు: నరసింహ జయంతి నాడు నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించకూడదు. ఈ రోజున పసుపు, ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగు సానుకూల శక్తి , శుభాన్ని సూచిస్తుంది.
శారీరక సంబంధం: ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించడం ముఖ్యం అని భావిస్తారు. కనుక నరసింహ జయంతి రోజున శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలని అంటారు.
