SGSTV NEWS online
Crime

నారదుడికి అంకితమైన ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా? గద్దె నుంచి సరస్సు వరకు ఆసక్తికర విశేషాలివే!



త్రిలోక సంచారి, వీణాపాణి, పరమ విష్ణుభక్తుడిగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన నారద మహర్షికి అంకితమైన ఆలయాలు చాలా అరుదు- భక్తి, జ్ఞానం, వైరాగ్యానికి నారద మహర్షి ప్రతీక

శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియ భక్తుడు, ఘోటక బ్రహ్మచారి నారద మహర్షి! లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే నారదుడు! త్రిలోక సంచారిగా ప్రసిద్ధి చెందిన నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు! నారద మహర్షికి అంకితమైన ఆలయాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఆ విశేషాలేంటో చూద్దాం

ఎవరీ నారద మహర్షి!
నారద మహర్షి హిందూ పురాణాల్లో ప్రసిద్ధులైన దేవర్షి, త్రిలోక సంచారి, పరమ విష్ణు భక్తుడు. “నారం” అనగా జ్ఞానం, “దదాతి” అనగా ఇచ్చువాడు. అనగా లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే నారదుడు. నారద మహర్షి స్వర్గ, భూమి, పాతాళ లోకాలతో పాటు ముల్లోకాలు అవలీలగా సంచరించగలడు. నారద మహర్షి సరస్వతీ దేవి అనుగ్రహంతో సంగీత విద్యను అభ్యసించి, “మహతి” అనే వీణను మీటుతూ నిత్యం “నారాయణ” నామాన్ని జపిస్తుంటాడు.

భక్తి ప్రచారం
ప్రహ్లాదుడు, ధ్రువుడు, వాల్మీకి, వ్యాసుడు వంటి మహానుభావుల్లో భక్తిభావాన్ని పెంపొందించి వారిని ఉత్తమ భక్తులుగా తీర్చి దిద్దడంలో నారదుని పాత్ర కీలకం. భారత, భాగవతాది గ్రంథాల్లో నారదుని ఉనికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎన్నో సందర్భాల్లో మహర్షులకు నారదుడు దర్శనమిచ్చి కర్తవ్యాన్ని బోధించినట్లుగా తెలుస్తోంది.

లోక కల్యాణ కారకం- కలహ ప్రియత్వం
పురాణాలను పరిశీలిస్తే అనేక సందర్భాల్లో నారదుని ప్రవర్తన పైకి కలహ ప్రియంగా కనిపించినప్పటికీ, దాని వెనుక ధర్మ రక్షణ, చెడును అంతం చేయడం, లోక కల్యాణమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. నారద మహర్షికి ప్రత్యేకించిన ఆలయాలు అతి తక్కువే అయినప్పటికీ ఆ ఆలయాలన్నీ నారదునికి అంకితం చేసి ఉండటం విశేషం. నారద మహర్షికి అంకితమైన ఈ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

కృష్ణానదీ తీరంలో నారదుని ఆలయం
కర్ణాటకలోని దావణగెరెకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిగతేరి ప్రాంతంలో రాయచూర్ నగరానికి దగ్గరలోని కోర్వా ద్వీపంలో, కృష్ణానదీ తీరంలో వెలిసిన నారదుని గుడి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.

నారద గద్దె
పచ్చని ప్రకృతి సౌందర్యాలు నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఒక ద్వీపంలో నెలకొని ఉన్న ఈ ఆలయం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి ఈ గుడిలో భక్తులు నారదమహర్షిని దేవుడిగా కొలవడం ఆచారంగా వస్తోంది. అందుకే కోర్వా ప్రాంతాన్ని ‘నారద గద్దె’ అని కూడా పిలుస్తుంటారు.

నారద మహర్షి తపస్సు చేసిన ప్రదేశం
కోర్వా ప్రాంతమంటేనే ద్వీప సముదాయం. ఆ ద్వీపం మధ్యలో నదీతీరంలో కొలువైన నారదమహర్షి ఆలయాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా ఎందరో భక్తులు తరలి రావడం విశేషం. ఈ ద్వీపంలోనే నారదమహర్షి కొన్నాళ్లు ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు ఆచరించారని తెలుస్తోంది. అందుచేతనే ఇక్కడ నారద మహర్షి ఆలయం వెలసి ఉందని విశ్వాసం.

మధ్యప్రదేశ్‌లో మరో ఆలయం
కేవలం కర్ణాటకలోనే కాదు, మధ్యప్రదేశ్‌లోని భీండ్ జిల్లాలో కూడా నారదుడికి ఒక ఆలయం ఉంది. కాళీ సింధ్ నదీ తీరంలో వెలసిన ఈ ఆలయం కూడా పురాతనమైనదే! పర్వదినాల సమయంలో, ఏకాదశి తిథుల్లో భీండ్‌లోని ప్రఖ్యాత శివుని ఆలయంతో పాటు నారదమహర్షి ఆలయాన్ని కూడా దర్శించుకోవడానికి విపరీతంగా భక్తులు తరలి వస్తుంటారు. ఆయా సమయాల్లో ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు కూడా జరగడం విశేషం.

తెలుగు రాష్ట్రంలో నారద సరస్సు
తెలుగు రాష్ట్రాల్లో నారద మహర్షికి ప్రత్యేకించి ఆలయాలు లేనప్పటికీ తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో వెలసిన భావనారాయణ స్వామి ఆలయంలో నారద సరస్సు ఉంది. ఈ క్షేత్ర స్థల పురాణం ప్రకారం నారదుడు ఈ కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందారని అంటారు. స్నానం చేయడానికి కొలనులో దిగేముందు మహర్షి కొలను గట్టున పెట్టిన మహతి వీణ, చిడతలు మాయమవుతాయి. మహర్షి తన గతాన్ని మర్చిపోయి స్త్రీ రూపంలో ఒక రాజును వివాహం చేసుకుంటాడు. అనంతరం ఆ రాజుకు, నారద మహర్షికి 60 మంది సంతానం కలుగుతారు. వారే కాలాంతరంలో ప్రభవ తో మొదలై, అక్షయతో ముగిసే 60 తెలుగు సంవత్సరాలుగా మారినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. సర్పవరంలో ఈ నారద సరస్సులో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని అంటారు. అందుకే ఈ సరస్సును ముక్తికా సరస్సు అని అంటారు. నారద మహర్షికి ప్రత్యేకించిన క్షేత్రాలు, ఆలయాలు సందర్శించడం వలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. మనం కూడా ఈ క్షేత్రాలు దర్శించి తరిద్దాం.

ఓం నమో నారాయణాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Related posts