వ్యాపారం నుంచి తప్పుకొన్న భాగస్వామి తన వాటా డబ్బులు తిరిగివ్వమని అడగ్గా స్నేహితుడే అతడిని కిరాయి వ్యక్తులతో అపహరించి.. కాళ్లూ చేతులు కట్టేసి కృష్ణా నదిలో పడేసి హత్య చేయించాడు.
జీడిమెట్ల : వ్యాపారం నుంచి తప్పుకొన్న భాగస్వామి తన వాటా డబ్బులు తిరిగివ్వమని అడగ్గా స్నేహితుడే అతడిని కిరాయి వ్యక్తులతో అపహరించి.. కాళ్లూ చేతులు కట్టేసి కృష్ణా నదిలో పడేసి హత్య చేయించాడు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. షాపూర్నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జి డీసీపీ కోటిరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన వెంకటప్పన్నరెడ్డి(54) రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. భార్య, ఇద్దరు కుమారులతో ఆల్విన్ కాలనీ ఈస్ట్సయినగర్లో ఉంటున్నారు. బాలానగర్లోని మేఘా సంస్థలో ఏజీఎంగా పనిచేస్తున్నారు. ఈ నెల 4న విధులకు వెళ్లి.. రాత్రయినా తిరిగి రాకపోవడంతో భార్య హేమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా స్నేహితుడే అపహరించినట్లు గుర్తించారు.
అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి చెందిన బత్తిన ద్వారకానాథ్ రెడ్డి(48) వెంకటప్పన్నరెడ్డికి విశాఖపట్నంలో పరిచయమయ్యాడు. ఇద్దరూ 2021-22లో కాకినాడ పోర్టులో క్యాటరింగ్, క్లీనింగ్ సర్వీస్ వ్యాపారం చేశారు. లావాదేవీల్లో విభేదాలు వచ్చాయి. భాగస్వామి వాటా డబ్బులు రూ.28 లక్షలు చెల్లించేందుకు ద్వారకానాథెడ్డి అంగీకరించాడు. నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో ఇటీవల ద్వారకానాథెడ్డి ఇంటికి వెళ్లి తన డబ్బులివ్వాలని వెంకటప్పన్నరెడ్డి నిలదీశాడు. కుటుంబ సభ్యుల ముందు నిలదీయడంతో పరువు పోయిందని భావించిన ద్వారకానాథెడ్డి స్నేహితుడిని హత్య చేసేందుకు పథకంవేశాడు. తెలిసిన వారి సాయంతో వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలానికి చెందిన సుధాకర్రెడ్డి(59)కి విషయం చెప్పాడు. అదే ప్రాంతానికి చెందిన పాశం ప్రసాద్(36) బుసుపాటి కిరణ్ కుమార్(30), గడ్డం వెంకటసుబ్బయ్య(25) అన్నిక మణికంఠ(25)లకు రూ.10వేల చొప్పున చెల్లించి హత్యకు ఒప్పందం చేసుకున్నాడు. వారు ఈ నెల 4న ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్న వెంకటప్పన్నరెడ్డిని కూకట్పల్లి మైత్రీనగర్ వద్ద అడ్డుకున్నారు. క్లోరోఫాం చల్లి అపస్మార స్థితిలోకి చేరిన తర్వాత కారులో జోగులాంబ గద్వాల జిల్లా కొత్తకోట తీసుకెళ్లారు. కాళ్లు, చేతులు కట్టేసి బీచుపల్లి బ్రిడ్జి మీద నుంచి కృష్ణానదిలో పడేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా జల్లెడపట్టి నిందితుల ఆచూకీని కనిపెట్టారు. పడేసిన చోటు నుంచి 15 కి.మీ. దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ సత్యనారాయణ, బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఉన్నారు.
Also read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి