మార్చి 26న జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పోలీసులు – కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ అభినందనలు
పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో మార్చి 26వ తేదీన జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం, పోలవరం మండలం పెద్దవం గ్రామంలో సచివాలయ సర్వేయర్గా చేస్తున్న శ్రీనివాస్ అదే ప్రాతంలో ఉంటున్న వ్యాపారి పెండ్యాల ప్రభాకర్ వద్ద గత ఏడాది డిసెంబర్లో రూ. 2 లక్షల 40 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును తీర్చాలని కొంతకాలంగా వ్యాపారి ప్రభాకర్, శ్రీనివాస్పై ఒత్తిడి తెచ్చాడు. అయితే బెట్టింగులు, తదితర వ్యసనాలకు అలవాటు పడిన శ్రీనివాస్ అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో ఎలాగైనా ప్రభాకర్ను హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అప్పు తీర్చవలసిన అవసరం లేదని భావించాడు.
చేతిని నరికి తన బ్యాగ్లో : పథకం ప్రకారం వ్యాపారి ప్రభాకర్కు ఫోన్చేసి కలిసి మాట్లాడాలని చెప్పడంతో దొమ్మేరులోని నీరుకొండ శేషగిరిరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ తోటలో కలిశారు. ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే శ్రీనివాస్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ప్రభాకర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. చివరికి ప్రభాకర్ మృతి చెందాడని నిర్ధారించుకున్నాక మృతుడి చేతికి ఉన్న బంగారు కడియం, నాలుగు బంగారు ఉంగరాలు తీసేందుకు శ్రీనివాస్ ప్రయత్నించాడు. అవి ఎంతకీ రాకపోవడంతో చేతిని నరికి తన బ్యాగ్లో వెసుకోని తీసుకెళ్లాడు. అలాగే మృతుడి మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా శ్రీనివాస్ తన వెంట తీసుకెళ్లాడు.
సంఘటన స్థలానికి మరో ఇద్దరు : అనంతరం శ్రీనివాస్ తన స్నేహితులైన అంకోలు జగదీష్, నోముల ప్రవీణ్ కుమార్లకు ఫోన్చేసి సంఘటన స్థలానికి రమ్మని చెప్పడంతో బైక్పై వచ్చిన ఇరువురితోపాటు, శ్రీనివాస్ అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 31.8 గ్రాముల బరువుగల బంగారు గొలుసు, 4.9 గ్రాములు బరువు గల బంగారు ఉంగరం, నేరంకి ఉపయోగించిన బైక్లు, మూడు సెల్ ఫోన్లు, ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆభరణాలను జగదీష్, ప్రవీణ్ కుమార్లు వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతో వాటిని రికవరీ చేయాల్సి ఉంది. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ దేవకుమార్ అభినందించారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే