July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

జగన్ అడ్డుకున్నారు: రఘురామ సంచలన ఆరోపణలు


ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ 2024: తనకు నరసాపురం టికెట్ రాకుండా ఏపీ సీఎం జగన్ అడ్డుకున్నారని, సన్నిహితుడు సోము వీర్రాజుతో కలిసి కుట్ర చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

అమరావతి: తాను మరోసారి నరసాపురం నుంచి బరిలోకి దిగాలని భావించిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ఏపీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించగా.. భూపతిరాజు శ్రీనివాసవర్మకు అవకాశం దక్కింది. తనకు దక్కకపోవడంపై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తాత్కాలికంగా ఓడిపోయానని, అందుకు కారణం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. తనకు నరసాపురం టికెట్ రాకుండా అడ్డుకుంటాడని అనుమానం ఉండేదని, ఇప్పుడు అది నిజమైందన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన రఘురామ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
జగన్‌ను అథఃపాతాళానికి తొక్కేస్తా!
గత నాలుగేళ్లుగా తనను జగన్ టార్గెట్ చేశారని, ఇప్పుడు తనకు నరసాపురం ఎంపీ టికెట్ రాకుండా చేశారని ఏపీ సీఎంపై ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి ఒక్కరితో అడుగులు వేయించి రాజకీయంగా జగన్‌ను అథఃపాతాళానికి తొక్కేయకపోతే తన పేరు రఘురామకృష్ణరాజే కాదన్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహకారంతో ఏపీ సీఎం జగన్ తనకు నరసాపురం టికెట్ రాకుండా అడ్డుకున్నారని రఘురామ పదే పదే వ్యాఖ్యానించారు. తాను నరసాపురం నుంచి పోటీ చేస్తానా, వేరే స్థానం చేస్తానా అనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. తనను కొన్ని పార్టీలకు దూరం చేయాలని చేసే కుట్రలో జగన్ తాత్కాలికంగా సక్సెస్ అయ్యారని రఘురామ పేర్కొన్నారు. తనకు నరసాపురం టికెట్ రాలేదని ముందే తెలియడంతో అభ్యర్థుల ప్రకటనకు కొంత సమయానికి ముందే సిట్టింగ్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో జగన్ అనుకున్నది జరగదని, కూటమి విజయం తథ్యమన్నారు ఎంపీ రఘురామ. ఆ పార్టీకి ఓటు వేస్తే వైసీపీకి ఓటు వేసినట్లేనని జనాలకు భ్రమ కల్పిస్తున్నారని అభిప్రాయపడ్డారు. గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేశాను.. నిజంగా పదవే అనుభవించాలని భావిస్తే… నాలుగేళ్లపాటు ఢిల్లీలో ఉంటూ అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని పార్టీలకు తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నా, ఆ కుట్రల్ని త్వరలోనే తిప్పి కొడతామన్నారు. తనకు టికెట్ రాకపోవడంపై ఎంతోమంది ఆందోళన చెంది, తనకు ఫోన్లు చేశారని, మెస్సేజ్ చేశారని చెప్పారు. తాత్కాలికంగా తాను వెనకడుకు వేస్తున్నానని, మళ్లీ అంతే వేగంగా ముందడుగులు వేస్తానని ధీమా వ్యక్తం చేశారు. నరసాపురంలో బీజేపీ నేత, కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

నాపై జైల్లో హత్యాయత్నం చేసి విఫలం
సీఎం జగన్ గతంలో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో హత్యాయత్నం చేసి విఫలమయ్యారు. పోలీస్ ఉన్నతాధికారుల సహాయంతో నన్ను లేపేయాలని చూశారు. నియోజకవర్గానికి, సొంత ప్రాంతానికి రాకుండా అడ్డుకున్నారు. జగన్‌ నన్ను డిస్‌క్వాలిఫై చేయాలని చూశారు. అప్పుడు జగన్ కు విజయం దక్కలేదు. కానీ నేడు నాకు నరసాపురం టికెట్ రాకుండా చూడటంలో జగన్ తాత్కాలికంగా విజయం సాధించారు. నా ఓటమిని అంగీకరిస్తున్నాను. చంద్రబాబుతో కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో వేరే ఆలోచనలు చేయడం లేదు. సొంత బాబాయి వివేకా హత్య, అమరావతి రైతులకు చేసిన అన్యాయం లాంటి ఎన్నో చూసిన తరువాతే జగన్‌పై తిరుగుబాటు చేశాను. గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వైసీపీ నేతలకు అధికారం దూరం చేసేందుకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తానని’ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు.

Also read

Related posts

Share via