SGSTV NEWS online
Andhra PradeshCrime

వరకట్న వేధింపులు తాళలేక.. కుమారున్ని చంపి తల్లి ఆత్మహత్య




చోడవరం (అనకాపల్లి) : వరకట్న వేధింపులు తాళలేక, ఓ వివాహిత కుమారున్ని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోడవరంలోని కనకమాలక్ష్మి నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మాడ గ్రామానికి చెందిన వీణ (30), అదే జిల్లా జియమ్మవలస మండలం కుందరువాడ గ్రామానికి చెందిన పోరెడ్డి ఉమామహేశ్వరరావు 2024లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉమామహేశ్వరరావు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కెపి అగ్రహారం యుపి స్కూల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. పెళ్లి జరిగిన నాటి నుంచి వీణకు కట్న వేధింపులు మొదలయ్యాయి. పుట్టింటి నుండి పెద్ద ఎత్తున కట్న కానుకలు తేవాలని భర్తతో పాటు అతని పినతల్లి కూతురు, కొడుకు ముదిలి రూప, మణికంఠ వేధించసాగారు. ఈ నేపథ్యంలో వీణ తల్లిదండ్రులకు చెప్పుకోలేక నరకయాతన అనుభవించారు. వేధింపులు తీవ్రం కావడంతో తుదకు గురువారం తన ఆరు నెలల కుమారుడు వీనస్‌ను హతమార్చి తాను సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లినాటి నుండి జరిగిన ఘటనలను ఆమె ఒక ఉత్తరంలో పొందుపరిచినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి స్వామినాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని డిఎస్‌పి శ్రావణి పరిశీలించారు. భార్యను వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్‌ చేశారు.

Also Read

Related posts