SGSTV NEWS online
Famous Hindu TemplesSpiritual

దసరా రోజే మూతపడే గుడి – దుర్గాష్టమే పండగ – ఇదే ఇక్కడ ఆచారం



దసరా ఉత్సవాల సందర్భంగా చుండూరు మండలం మోదుకూరులోని శ్రీకనకదుర్గమ్మ వారి ఆలయంలో పూజలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ నవరాత్రులకు సంబంధించి అమ్మవారికి ఎలాంటి అలంకారాలు ఉండవు.

Modukuru Durga Temple Specialty : పరమేశ్వరుని శక్తి స్వరూపమే జగన్మాత! ఆదిపరాశక్తి ఆరాధనకు విశిష్టమైన శరన్నవరాత్రులు! ఈ సందర్భంగా అమ్మవారు వివిధ అలంకరణల్లో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయాలతో పాటు మండపాల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు. కానీ ఓ ఆలయం మాత్రం ఇందుకు చాలా భిన్నం. ఇక్కడ నవరాత్రులకు సంబంధించి అమ్మవారికి ఎలాంటి అలంకారాలు ఉండవు. అంతేకాక దుర్గాష్టమే పండగలా నిర్వహిస్తారు. మరో విచిత్రం ఏంటంటే విజయదశమి రోజున గుడిని మూసివేస్తారు. మరి ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందేె.

బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరులోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఇక్కడ నవరాత్రుల సందర్భంగా పూజలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే అమ్మవారికి ఎలాంటి అలంకారాలు ఉండవు కానీ విశేష పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా విజయదశమికి ముందు రోజు దుర్గాష్టమి ఉత్సవాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు. దీనికి స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

Unique Tradition in Modukuru : తెల్లవారుజామునుంచే శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. ఇక్కడ నుంచి వివిధ ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతాలు వెళ్లిన వారు దసరాకు కుటుంబ సమేతంగా గ్రామానికి రావడంతో ఊళ్లో సందడి వాతావరణం నెలకొంటుంది. అమ్మవారి పుట్టిల్లు కందేపాడు నుంచి పసుపు, కుంకుమ, సారె చీర బండిపై తీసుకొచ్చి, దుర్గమ్మ ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం అదేరోజు అర్ధరాత్రి సమయంలో అమ్మవారి కుంభం పోసి, గుడిని మూసివేయడం ఇక్కడ ఆచారంగా వస్తుంది.

గుడి మూసిన తొమ్మిది రోజుల తర్వాత తలుపులు తెరచి పండగ చేసుకుంటారు. ఇందులో భాగంగా తెల్లవారుజామునుంచే అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు మొదలవుతాయి. వందలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. విశేష పూజల అనంతరం అమ్మవారి కుంకుమ, తీర్థప్రసాదాలు అందజేస్తారు. మొక్కలున్నవారు నవధాన్యాల మొలకలతో కూడిన జల్లి బుట్టలతో, మెడలో పిండి వంటలమాలలు ధరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదర్శనలో చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు పాల్గొని మొక్కలు తీర్చుకుంటారు. తర్వాత గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం అందుకుంటారు.

Related posts