December 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పురోహితుడిపై ఆకతాయిల దుశ్చర్య



కాకినాడలోని శివాలయంలో ఇద్దరు అర్చకులపై ఓ అధికార పార్టీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో పురోహితుడిపై ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడ్డారు.



మూలపేటలో ఆలస్యంగా వెలుగులోకి..

కొత్తపల్లి, పిఠాపురం: కాకినాడలోని శివాలయంలో ఇద్దరు అర్చకులపై ఓ అధికార పార్టీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో పురోహితుడిపై ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఈ నెల 12న ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఆ వివాహ తంతును జరిపించడానికి గ్రామానికి చెందిన పురోహితుడు ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ వెళ్లారు. వివాహం జరిపిస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు పురోహితుడిపై దుశ్చర్యకు పాల్పడ్డారు. పురోహితుడు శర్మ తలపై సంచి వేయడం, పసుపు, కుంకుమ, వాటర్ ప్యాకెట్లు చల్లడంతో పాటు ఇతర సామగ్రి విసిరారు. ఈ తంతు అంతా వీడియో చిత్రీకరించి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ కావడంతో బ్రాహ్మణ, విశ్వహిందూ పరిషత్తు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పలువురు బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ‘న్యూస్టుడే’ బాధితుడు సూర్యనారాయణమూర్తి శర్మను సంప్రదించగా.. ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడింది వాస్తవమే అన్నారు.  ఆ విధంగా తనపై ప్రవర్తించడం వల్ల బాధకు గురయ్యానన్నారు. దీనిపై విశ్వహిందూ పరిషత్ సంఘాలు కల్పించుకున్నాయన్న ఆయన.. సోమవారం చర్చించుకుని ఏంచేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాధానం చెప్పారు. 

Also read

Related posts

Share via