SGSTV NEWS online
CrimeTelangana

హైదరాబాద్ లొ భారీ చోరీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 70 తులాల బంగారం మాయం!



హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయాన్ని అదునుగా తీసుకున్న దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 70 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లి బాధిత కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఈ ఘటన ఆసిఫ్నగర్ పరిధిలోని జేబా బాగ్ డీ-క్లాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. జేబా బాగ్ డీ-క్లాస్ కు చెందిన మహమ్మద్ వాసిం కుటుంబ సభ్యులతో కలిసి నవంబర్ 27వ తేదీ రాత్రి ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం బీరువాను తెరిచి అందులో భద్రపరిచిన సుమారు 70 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. చోరీ అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

కార్యక్రమం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆసిఫ్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? చోరీ వెనుక ఎంతమంది ఉన్నారు? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

నగరంలో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also read

Related posts