తుంగభద్రా నది తీరంలో వెలసిన మంత్రాలయం- శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర మధ్వ క్షేత్రం- రాఘవేంద్ర స్వామి జీవితం, బృందావన ప్రవేశం, మంత్రాలయంలో దర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు
మన దేశంలో ఎందరో సిద్ధపురుషులు, మహర్షులు, యతీంద్రులు తమ తపోశక్తితో భగవంతుని సాక్షాత్కారం పొందారు. ఎందరో మహానుభావులు అజ్ఞానాంధకారంలో ఉన్న సమాజాన్ని ఉద్ధరించడానికి దేశాటన చేస్తూ తమ ప్రవచనాలతో, సత్కర్మలతో ధర్మ సంస్థాపన చేసి సమాజాన్ని ధర్మ మార్గంలో పయనించేలా చేశారు. అలాంటి మహనుభావుల్లో యతీంద్రులు గురు రాఘవేంద్రస్వామి కూడా ఒకరు. ఆగస్టు 30, ఆదివారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వర్ధంతి సందర్భంగా అయన సజీవ సమాధి పొందిన పవిత్ర మంత్రాలయం క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రాతః స్మరణీయులు
పేరు చెప్పగానే చేతులెత్తి నమస్కరించాల్సిన గొప్ప సిద్ధ పురుషులు, జీవసమాధి చెందిన పరమ యతీంద్రులు శ్రీ రాఘవేంద్ర స్వామి! ఈ మహాస్వామివారు సిద్ధి పొందిన నాటి మంచాల గ్రామమే నేటి మంత్రాలయం. తుంగభద్రా నది పవిత్ర తీరంలో వెలసిన మంత్రాలయం మధ్వ సంప్రదాయానికి అత్యంత పవిత్రమైన క్షేత్రం.
ఎవరీ రాఘవేంద్రుడు?
16వ శతాబ్దానికి చెందిన హిందూ మత సన్యాసి, మధ్య సంప్రదాయానికి చెందిన రాఘవేంద్రుడు శ్రీ తిమ్మన్న భట్ట, శ్రీమతి గోపికాంబ దంపతులకు రెండో కుమారుడు. ఇతని పూర్వాశ్రమ నామం వెంకన్న భట్ట. వెంకటనాథునిగా పిలిచే వెంకన్న భట్ట క్రీ.శ 1595లో తమిళనాడులోని చిదంబరం సమీపంలోని భువనగిరిలో గురువారం రోజున ఫాల్గుణ మాసం శుక్ల సప్తమి రోజున మృగశిర నక్షత్రంలో జన్మించారు.
విద్యాభ్యాసం
వెంకట నాథుడు చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వాడిగా, పండితుడిగా నిరూపించుకున్నాడు. మధురైకి చెందిన లక్ష్మీనరసింహచార్యుల వద్ద ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు వెంకటనాథుడు పసి వయసులోనే ‘ఓం’ కారం పరమార్థం గురించి తండ్రిని ప్రశ్నించి అబ్బుర పరిచాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో మథురై నుంచి తిరిగి వచ్చారు.
వివాహం
వెంకట నాథుడు సంపన్న కుటుంబానికి చెందిన సరస్వతిని వివాహం చేసుకున్నాడు. ఇంద్రియాలపై నియంత్రణ ఉన్న వ్యక్తికి వైవాహిక జీవితం విద్యకు ఆటంకం కలిగించదని శాస్త్రాలు చెబుతున్నాయి. సరస్వతీ దేవి ఆశీర్వాదం ద్వారా సరస్వతిని వివాహం చేసుకున్న తర్వాత వేంకటనాథుడు చాలా విషయాలను నేర్చుకున్నారు.
జ్ఞాన సముపార్జన
వివాహం తరువాత కుంభకోణం విద్యాపీఠానికి చేరుకున్న వెంకట నాథుడు సుధీంద్ర తీర్థ వద్ద ద్వైత వేదాంత, వ్యాకరణం, ఇతర గ్రంథాలను, అధునాతన రచనలను అభ్యసించారు. సుధీంద్ర తీర్థ అతని నైపుణ్యాన్ని చూసి ‘మహాభాష్య వెంకట నాథాచార్య’ అని పిలిచారు.
సన్యాస దీక్ష
వెంకట నాథుడు 1621లో సన్యాస దీక్ష చేపట్టి ఆధ్యాత్మిక గురువు శ్రీ సుధీంద్ర తీర్థ స్వామి ఆదేశం మేరకు ఆయన పీఠానికి అధిపతిగా కొంతకాలం ఉన్నాడు. తరువాత సన్యాసికి జీవన్ముక్తి ఒకేచోట ఉంటే సాధ్యం కాదని దేశాటన ప్రారంభించాడు. ఆలా ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ తెలుగు దేశానికి వచ్చి తరువాత ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుల నుంచి మంచాల గ్రామాన్ని దానంగా స్వీకరించి అక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకుని తన తపస్సు కొనసాగించాడు. అదే నేటి మంత్రాలయం. శ్రీహరి మహిమను జీవితాంతం ప్రచారం చేసిన రాఘవేంద్ర స్వామి అనేక మహిమలను ప్రదర్శించి భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదీతీరాన ఉన్న మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావన క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
జీవసమాధి
శ్రీ రాఘవేంద్ర స్వామి 1671లో శ్రావణ మాసం కృష్ణ పక్షం విదియ రోజున జీవసమాధి పొందారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. స్వామి వారి నిజ బృందావనం వెలసిన మంత్రాలయం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.
నేటికీ సజీవంగా
శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారు సజీవ బృందావన ప్రవేశం చేసి నేటికీ భక్తులను అనుగ్రహిస్తున్నారని విశ్వాసం. ప్రతి గురువారం లక్షలాది మంది భక్తులు స్వామివారి బృందావనాన్ని దర్శించి ఆశీస్సులు పొందుతారు. మంత్రాలయంలో దర్శించదగిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటో చూద్దాం.
శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం
శ్రీ రాఘవేంద్రులు సజీవ సమాధి పొందిన పవిత్ర స్థలం. ఇక్కడ నిత్య పూజలు, సేవలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
శ్రీ గురు సార్వభౌమ విద్యాపీఠం
సంస్కృత విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన పీఠం. అరుదైన గ్రంథాల సమాహారం ఇక్కడ ఉంది.
శ్రీ మాంచాలమ్మ దేవాలయం
రాఘవేంద్ర బృందావన దర్శనానికి ముందు మాంచాలమ్మను దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది ఆగస్టు 30, ఆదివారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వర్ధంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాఘవేంద్ర స్వామి మఠాల్లో ఘనంగా జరగనున్నాయి. శ్రీ గురు రాఘవేంద్రుల వర్ధంతి సందర్భంగా ఆ సిద్ధ పురుషుని బృందావనాన్ని మనం కూడా దర్శించి తరిద్దాం.
ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః
