July 3, 2024
SGSTV NEWS
CrimeNational

గురుగ్రాంలో గుట్టుగా కిడ్నీ రాకెట్‌ దందా.. 30 యేళ్లలోపు నిరుపేద యువతే టార్గెట్‌!

గురుగ్రాం, ఏప్రిల్ 5: గురుగ్రామ్‌లో కిగ్నీ రాకెట్‌ గుట్టురట్టైంది. ఓ ప్రముఖ హోటల్‌లో దిగిన బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ స్కామ్‌ను బట్టబయలు చేశాడు. హర్యానా ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ హోటల్‌లో పట్టుబడిన వ్యక్తి కిడ్నీ దాత. డబ్బు ఎర చూపి మెడికల్ వీసాపై భారతదేశానికి వచ్చాడు. ఆ వ్యక్తిని విచారించగా ఓ పెద్ద ఆస్పత్రి పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హర్యానా ఆరోగ్య శాఖ బృందం, సీఎం ఫ్లయింగ్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్ పౌరుడు షమీమ్‌ను గురుగ్రామ్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో ఉన్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. పక్కాప్లాన్‌తో దాడులు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో షమీ అనేక విషయాలు బయటపెట్టాడు. ఫేస్‌బుక్‌లో కిడ్నీ దానానికి సంబంధించిన ప్రకటన చూశానని, ఆ తర్వాత కిడ్నీ దానం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు భారత్‌ నుంచి ముర్తజా అన్సారీ అనే వ్యక్తిని సంప్రదించినట్లు చెప్పాడు. అనంతరం పలుచోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారని, వైద్య పరీక్షల అనంతరం కోల్‌కతా నుంచి మెడికల్ వీసాపై భారత్‌కు తీసుకొచ్చినట్లు షమీమ్ చెప్పాడు

గురుగ్రామ్‌లోని లగ్జరీ గెస్ట్‌హౌస్‌లో షమీమ్‌కు అన్ని వైద్య సదుపాయాలు కల్పించారు. జైపూర్‌లోని అనేక ఆసుపత్రులలో ముర్తజా అన్సారీకి పరిచయాలు ఉన్నట్లు షమీమ్ చెప్పాడు. గురుగ్రామ్‌లోని ప్రముఖ ఆసుపత్రి పేరుతో రోగులను మోసం చేసి, అదే పెద్ద ఆసుపత్రిలోని జైపూర్ బ్రాంచ్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తున్నట్లు తెలిపాడు. బంగ్లాదేశ్‌లో మొబైల్ షాప్ నడుపుతున్న షమీమ్ భారత్‌లో తన కిడ్నీ దానం చేసేందుకు 4 లక్షల బంగ్లాదేశ్ టాకా (రూ.3 లక్షలు) తీసుకున్నట్లు షమీమ్ చెప్పాడు. మరోవైపు కిడ్నీ అవసరమైన వ్యక్తి నుంచి మధ్యలో ఉన్నవారు రూ.10-20 లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపాడు. ఈ స్కామ్ చాలా కాలంగా జరుగుతోందని, ఏ దాతకి ఏ రిసీవర్‌తోనూ ఎలాంటి సంబంధం ఉండదని విచారణలో తెలిపాడు.

నిరుపేద యువతే టార్గెట్
ప్రస్తుతం గురుగ్రామ్ సెక్టార్ 39లో ఉన్న గెస్ట్ హౌస్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం కుంభకోణంలో హోటల్ యజమాని ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుకు ఆశపడి కిడ్నీలు ఇచ్చేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్‌లోని పేద యువకులను ఈ ముఠా టార్గెట్ చేసింది. ఒక వ్యక్తి ఇందుకు సిద్ధమైన తర్వాత, మొదట అతని బ్లడ్ గ్రూప్ తనిఖీ చేయమని అడుగుతారు. ఆ తర్వాత అక్కడ మరికొన్ని పరీక్షలు చేసి, ఫైనల్‌గా కన్ఫామ్‌ చేసుకుని భారత్‌కు రప్పిస్తారు

రాకెట్‌లో కింగ్‌పిన్ ఎవరు?
కిడ్నీ రాకెట్ ముఠా నాయకుడు ముర్తజా అన్సారీ అని సమాచారం. బంగ్లాదేశ్‌కు చెందిన యువతను మాయమాటలతో భారత్‌కు తీసుకొచ్చే సూత్రధారి అతడే. ముర్తజాను పట్టుకునేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో గాలంపు చేపట్టారు. ముర్తాజా అన్సారీ జార్ఖండ్‌లోని రాంచీ నివాసి. జార్ఖండ్ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ చేశాడు. ముర్తాజా చదువులో రాణించేవాడు. పీజీ చేయకముందే అతనికి మెడికల్ లైన్‌తో సంబంధం ఉంది. ఈ వ్యవహారంలో అన్సారీ తనతో పాటు చాలా మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. వారు 30 ఏళ్లలోపు యువకులను టార్గెట్‌ చేసుకుని దందా సాగించేవారు.

కాగా గతంలో కూడా గురుగ్రామ్‌లో కిడ్నీ రాకెట్‌ పట్టుబడింది. 2008లో కూడా గురుగ్రామ్‌లోని పాలం విహార్‌లో కిడ్నీ రాకెట్ వెలుగుచూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యూపీ యువతను గురుగ్రామ్‌కు తీసుకొచ్చి, కిడ్నీకి రూ.30 వేలు ఎర చూపి గుట్టు చప్పుడు కాకుండా అవయవాలు మాయం చేసేవారు. ఒప్పుకోని వారిని బెదిరించి బలవంతంగా కిడ్నీలు తీసుకునేవారు. అప్పట్లో అమెరికా, బ్రిటన్, సౌదీ వంటి దేశాల కస్టమర్లకు కిడ్నీలు ఇలా పంపిణీ చేసేవారు. ఫిబ్రవరి 2008లో ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు.

Also read

 

Related posts

Share via