SGSTV NEWS
Andhra PradeshCrime

పట్టపగలే విద్యార్థిని కిడ్నాప్

కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా కారులో ఎత్తుకెళ్లిన దుండగులు

నంద్యాల జిల్లా చాగలమర్రిలో ఘటన



చాగలమర్రి: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినిని గుర్తు  తెలియని దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం కానగూడూరుకు చెందిన మంత్రాల గౌస్, మస్తాన్బీల కుమార్తె షాజిదా స్థానిక డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. రోజూ కానగూడూరు నుంచి చాగలమర్రిలోని కాలేజీకి బస్సులో వచ్చి వెళ్తుంటుంది.

షాజిదా తనకు అనారోగ్యంగా ఉందని.. ఇంటికి వెళ్లడానికి అనుమతివ్వాలని గురువారం ఉదయం 11.30 సమయంలో ప్రిన్సిపాల్ను కోరింది. ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ప్రిన్సిపాల్ ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కాలేజీ గేటు దాటి బయటికి వచ్చిన షాజిదాను.. అక్కడే కాపు కాచి ఉన్న దుండగులు బలవంతంగా కారులోకి లాగేసి.. ఎత్తుకెళ్లారు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో తండ్రికి షాజిదా ఫోన్ చేసి.. కిడ్నాప్ విషయాన్ని చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సురేశ్, ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళిధర్రెడ్డి చాగలమర్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే విద్యార్థినిని కిడ్నాప్ చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు.

Also read

Related posts