SGSTV NEWS
National

Karur Stampede : విజయ్‌ టీవీకే ప్రచారంలో పవర్‌ కట్‌….సంచలన విషయం వెల్లడించిన విద్యుత్‌బోర్డు


కరూర్‌ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు విజయ్‌ నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనివెనుక కుట్ర కోణం దాగి ఉందని టీవీకే ఆరోపించింది. విజయ్ సభలో పవర్ కట్ చేశారని తెలిపింది. అయితే దీన్ని రాష్ట్ర విద్యుత్ బోర్డు ఖండించింది.

తమిళనాడు(tamilnadu) లోని కరూర్‌ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు, సీని నటుడు విజయ్‌(tvk vijay) నిర్వహించిన  ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించడంతో పాటు పలువురు గాయపడ్డారు. అయితే ఈ తొక్కిసలాటలో  కుట్ర కోణం దాగి ఉందని టీవీకే ఆరోపించింది.  విజయ్‌ ర్యాలీకి వచ్చిన కొంత సేపటికే  సభ ప్రాంగణంలో కొంత సమయం పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని టీవీకే తెలిపింది. అయితే  టీవీకే ఆరోపణలను తమిళనాడు విద్యుత్తు బోర్డు తిప్పికొట్టడంతో పాటు సంచలన విషయాన్ని వెల్లడించింది. విజయ్‌ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని కోరుతూ టీవీకేనే తమకు వినతిపత్రం ఇచ్చినట్లు ఆ రాష్ట్ర విద్యుత్తు బోర్డు చీఫ్‌ ఇంజినీర్‌ రాజ్యలక్ష్మి ధ్రువీకరించడం సంచలనంగా మారింది. అయితే విద్యుత్‌ సరఫరా నిలిపివేయడానికి తాము అంగీకరించలేదని రాజ్యలక్ష్మి వెల్లడించారు.



సెప్టెంబర్ 27, 2025 రాత్రి ఈ రోడ్డులోని వేలుసామిపురం వద్ద విజయ్‌ సభ ఉన్నందున భారీ జనసమూహం ఉంటుందని టీవీకే నుండి లేఖ అందిందని విద్యుత్తు బోర్డు చీఫ్‌ ఇంజినీర్‌ రాజ్యలక్ష్మి తెలిపారు. జనం ఎక్కువగా ఉంటారు కనుక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. విజయ్‌ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని (Power Cut) టీవీకే నేతలు  కోరారని ఆమె తెలిపారు. కానీ ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామని వివరించారు.  మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం స్పందించింది.. తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని వివరించింది. ఆ పార్టీ ఏర్పాటుచేసుకున్న జనరేటర్లలో సమస్య తలెత్తడంతో  కొన్ని లైట్లు మసకబారాయని కరూర్‌ జిల్లా కలెక్టర్ వివరించారు.

అయితే తొక్కిసలాట  ఘటన అనంతరం టీవీకే మాత్రం దీనిలో కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించింది. తమ నేత విజయ్(TVK President Vijay) ర్యాలీ వేదికకు చేరుకున్న సమయంలో  విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపించింది. దీంతో అభిమానులు ఆయన్ను చూసేందుకు ముందుకు దూసుకువచ్చారని.. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు వారు పేర్కొంటున్నారు. తొక్కిసలాటకు ముందు కొంతసేపు కరెంటు సరఫరా నిలిచిపోయినట్లు పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్పినట్లు  స్థానిక మీడియా కూడా పేర్కొనడం గమనార్హం.

Also read

Related posts