SGSTV NEWS online
Andhra PradeshCrime

మద్యం రవాణా కుంభకోణం- కారుమూరి సునీలే ప్రధాన సూత్రధారి!



Karumuri Sunil Involved In liquor Scam:జగన్‌ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణాన్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తరఫున ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌ అన్నీతానై నడిపించారని సిట్‌ తేల్చింది.


గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భారీ స్కామ్‌లో మాజీ సివిల్ సప్లైస్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కీలక పాత్ర పోషించారని, సబ్‌ కాంట్రాక్టుల కేటాయింపు నుంచి వసూళ్ల వరకు అంతా తానై నడిపించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. ఈ మేరకు నగదు బదిలీలకు సంబంధించిన పక్కా ఆధారాలతో కూడిన అభియోగపత్రాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సమర్పించారు.

ముసుగు సంస్థ ద్వారా దోపిడీ: సిట్ దర్యాప్తు నివేదిక ప్రకారం వైఎస్సార్సీపీ మద్యం ముఠాలోని కీలక సభ్యులైన రాజ్ కేసిరెడ్డి, డి. వాసుదేవరెడ్డి, టి. ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఒక సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరు ‘సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ముసుగు సంస్థ పేరిట రాష్ట్రవ్యాప్తంగా మద్యం రవాణా కాంట్రాక్టును దక్కించుకున్నారు. తన తండ్రి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకున్న రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకుని, ఆయన కుమారుడు సునీల్ స్వయంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లోని ప్రతి డిపోకు సంబంధించి రవాణా ఉప-కాంట్రాక్టర్లను ఖరారు చేశారు.

లాభాల్లో 85% వరకు వాటాలు: ఈ సబ్‌ కాంట్రాక్టులను కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా కారుమూరి కుటుంబం భారీగా కమీషన్లు వసూలు చేసింది. కొందరు సబ్‌ కాంట్రాక్టర్ల లాభాల నుంచి 45 శాతం, మరికొందరి నుంచి ఏకంగా 85 శాతం మేర వాటాలను కారుమూరి కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు అధికారులు నిర్ధారించారు.

ఫేక్ ఇన్‌వాయిస్‌లతో రూ. 24.45 కోట్ల దోపిడీ: మద్యం రవాణాకు సంబంధించిన ప్రతి బిల్లుపై రూ. 45 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు అదనంగా పెంచేసి, ఇన్ఫ్లేటెడ్ (దొంగ) ఇన్‌వాయిస్‌ల ద్వారా మొత్తంగా రూ. 24.45 కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ స్పష్టం చేసింది.

👉 నగదు రూపంలో మళ్లింపు: ఈ అవినీతి సొమ్ములో దాదాపు రూ. 16 కోట్లను సబ్‌ కాంట్రాక్టర్లు తమ బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా చేసి, మధ్యవర్తుల ద్వారా నగదు రూపంలో కారుమూరి కుటుంబానికి అందజేశారు.

👉  ఖాతాల్లోకి ఆన్‌లైన్ బదిలీలు: మరికొంత మొత్తాన్ని సునీల్, ఆయన భార్య వల్లూరు కీర్తి దంపతుల ఉమ్మడి/వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆన్‌లైన్ ద్వారా నేరుగా జమ చేయించుకున్నారు.

అక్రమ సొమ్ముతో విలాసాలు: మద్యం స్కామ్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మును కారుమూరి కుటుంబం తమ వ్యక్తిగత అప్పుల చెల్లింపులు, లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు, మైనింగ్ లీజుల హక్కుల కొనుగోలు, విలాసవంతమైన పుట్టినరోజు వేడుకలు, రాజకీయ నిధుల కోసం విచ్చలవిడిగా వాడినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న కారుమూరి సునీల్‌ను సిట్ అధికారులు ఇటీవలే రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని లోతుగా విచారించారు. ఈ విచారణ అనంతరం నగదు లావాదేవీల పూర్తి చిట్టాను న్యాయస్థానం ముందు ఉంచడంతో కారుమూరి కుటుంబం చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది.

Also read

Related posts